Read News in Telugu Language
adsdaksha

పులకించిన భక్తజనం…మారుమోగిన రామ నామం..

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 22

అట్టహాసంగా అయోధ్యలో అభినవ రాముడి విగ్రహ ప్రతిష్టాపన..

భక్తి పారవశ్యంలో మునిగి తేలిన తెలుగు రాష్ట్రాలు..

500 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఉద్విగ్నంగా ఎదురు చూసిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అత్యంత రమణీయంగా కన్నుల పండువగా పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. సరిగ్గా మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహించారు. అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్‌దేశం వేచిచూసిన సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. ఎన్నో శతాబ్ధాల కల నెరవేరింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య అయోధ్య గర్భగుడిలో మద్యాహ్నం 12.29 గంటలకు రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కత్రువు పూర్తి చేశారు. అభిజిత్‌ లగ్నంలో ప్రధాని మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మొత్తం 84 సెకన్ల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగింది. అనంతరం బాల రాముడి పాదాలపై పూలువేసి నమ్రతతో నమస్కరించారు. ఈ వైభవాన్ని దేశ ప్రజలు, రామభక్తులంతా లైవ్‌లో కన్నులారా వీక్షించారు.

అంతకుముందు అయోధ్య ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ..స్వామివారికి పట్టువస్త్రాలు, ఛత్రం సమర్పించారు. ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌, యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ పాల్గొన్నారు. జగమంతా సంబరంలా.. భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం కురిపించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు.. కర్తలుగా వ్యవహరించారు. ఈ సమయంలో 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు 2 గంటల పాటు మంగళ వాయిద్యాలు మోగించారు.

Read also: అస్సాంలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర.. మోరిగావ్ జిల్లాలో పాదయాత్రపై ఆంక్షలు..

ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మందికి పైగా పాల్గొన్నారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ, మందిర ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది అయోధ్యకు తరలి వచ్చారు. దాంతో అయోధ్య నగర వీధులన్నీ రామనామస్మరణతో మార్మోగాయి.

Hospital

జై సియా రామ్ ..అంటూ ప్రధాని మోదీ అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఈ మహత్తర ఘట్టం గురించి ప్రసంగించారు. తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ‘జై సియా రామ్‌’ అంటూ తన భక్తిభావాన్ని చాటుకున్నారు. మన రామ్‌లల్లా ఇకపై చిన్నపాటి టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని, దివ్య భవ్యమైన మందిరంలో కొలువుదీరారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నా అన్నారు. ఈ రోజు రామ భక్తులంతా ఆనంద పారవశ్యంలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ శతాబ్ధాల కలను సాకారం చేసుకునేందుకు ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాలు చేసినట్లు గుర్తు చేశారు. ఇలాంటి అనేక ఘటనల తర్వాత బాలరాముడు మళ్లీ అయోధ్యకే వచ్చి చేరుకున్నాడని చెప్పారు. ఈ శుభ గడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

ఈ పుణ్యకార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. జనవరి 22, 2024.. ఇది కేవలం తేదీ మాత్రమే కాదని. కొత్త కాలచక్రానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ గొప్ప కార్యంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా చివరకు న్యాయమే గెలిచించిందని ప్రధాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇందుకు న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ‘‘ఈ శుభ గడియల కోసం 11 రోజులపాటు కఠోర దీక్ష చేసినట్లు తెలిపారు. రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించా. ఏపీలోని లేపాక్షి ఆలయం, తమిళనాడులోని రామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నా. సాగర్‌ నుంచి సరయూ వరకు రామనామం జపించానన్నారు. మన దేశ సంస్కృతి కట్టుబాట్లకు రాముడే మూలం. ఆయన ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యం. ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠే కాదు.. మన విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ అని చెప్పుకొచ్చారు.

Read also: కోటి ఇండ్లకు సోలార్ ప్యానెల్స్ ..

రాముడు వివాదం కాదు సమాధానం అని మోదీ సంచలన విషయాలు వెల్లడించారు. రాముడు అగ్ని కాదు.. వెలుగు అంటూ శ్రీరాముని విశిష్ఠతను వివరించారు. రాముడే భారతదేశానికి ఆధారం అని చరిత్రను గుర్తు చేశారు. భారతదేశ విధానం కూడా అదేనని వివరించారు. నిత్యం, నిరంతరం, విశ్వం, విశ్వాత్మ శ్రీరాముడే అని ఆయన పరిపూర్ణత్వాన్ని తన ప్రసంగంలో అందించారు. కొన్ని శతాబ్దాల వరకూ ఈ పవిత్ర తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారని తన భావనను వ్యక్త పరిచారు. ఈ క్షణం కోసం స్వాతంత్ర్యానికి పూర్వం, తరువాత అనేక మంది అనేక రకాలుగా తమ స్వరాన్ని వినిపించారు. అలాగే అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారన్నారు. దేశ ప్రజలందరి తరఫున ఈ పుణ్య కార్యంలో పాల్గొనడం మహదానందంగా ఉందన్నారు. ఈ రోజు దేశమంతా దీపావళి జరుపుకుంటోందని.. ఈ రాత్రికి ప్రతి ఇంటా రామజ్యోతి వెలగాలని మోదీ పిలుపునిచ్చారు.

అయోధ్యకు తరలి వెళ్ళిన సినీ ప్రముఖులు..

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఎంతో మంది భక్తులు, సినీ సెలబ్రెటీలు అయోధ్య చేరుకున్నారు.
రజనీకాంత్‌, మాధురి దీక్షిత్‌, రణ్‌బీర్‌ కపూర్‌, కత్రినా కైఫ్‌, ఆయుష్మాన్‌ ఖురానా, అలియాభట్‌, ఫిల్మ్‌ మేకర్‌ రాజ్‌కుమర్‌ హిరానీ, రోహిత్‌ శెట్టి చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా అయోధ్యకు చేరుకున్నారు. చిరంజీవి, సురేఖ , రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో అయోధ్యకు తరలి వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య రామాలయానికి ప్రముఖ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా చేరుకున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, అభిషేక్‌ బచ్చన్‌ కూడా రామాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా శ్రీ బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ గురించి పోస్ట్ లు షేర్ చేస్తూ భక్తిని చాటుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.