Read News in Telugu Language
adsdaksha

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం : భట్టి

దక్ష న్యూస్, హైదరాబాద్: డిసెంబర్ 28

బిఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోవడం దుర్మార్గం..

అబ్దుల్లాపూర్ మెట్ లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

మాది దొరల ప్రభుత్వం కాదని, ప్రజల చేత ప్రజల కోసం ఏర్పడ్డ ప్రజల ప్రభుత్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడమే కాంగ్రెస్ ప్రజాపాలన ఉద్దేశ్యమని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ లో గురువారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓ వర్గానికి, ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వం తమది కాదని, రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేసే ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు.

అబ్దుల్లాపూర్ మెట్ గ్రామపంచాయతీ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయ హస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని భట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలం పాటు పరిపాలన చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇవ్వకుండా పేదలను మోసం చేసిన దుర్మార్గమైన పాలన బిఆర్ఎస్ చేసిందని మండిపడ్డారు.

పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదని భట్టి అన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దగ్గరకు వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి చేస్తున్న కార్యక్రమమే ప్రజాపాలన అని వివరించారు. ఒక వర్గానికి, ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వం కాదు మాది. మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం కాదు మాది. తెలంగాణ బిడ్డలై ఉన్న ప్రతి ఒక్కరు 6 గ్యారెంటీలు పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ పక్షపాతం తాము వహించం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలు కచ్చితంగా అందిస్తామని” భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Read also: ప్రభుత్వం ప్రజలకు జవాబు దారీగా ఉండాలి.. ఇక మీదట సెక్రటేరియెట్‌లో మీడియా సెంటర్

Hospital

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు కావద్దని కోరుకుంటున్న బిఆర్ఎస్ కలలను నిజం కానివ్వమని, ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు. ఆరు గ్యారంటీల అమలుతో రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలు బాగు పడటం బిఆర్ఎస్ కు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించినట్టుగానే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి మాది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని చాటి చెప్పామన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముగిసిన గంట లోపునే అదే ప్రాంగణంలో రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడానికి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని వివరించారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచడం వల్ల పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో లబ్ధి జరుగుతున్నదని భట్టి విక్రమార్క వెల్లడించారు. అభయ హస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కోసం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పారదర్శకంగా దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నట్లు చెప్పారు. నేటి నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని,
ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి దరఖాస్తులను స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

Read also: ప్రజాపాలనకు ఉమ్మడి జిల్లాల వారీగా నోడల్ అధికారుల నియామకం ..

ప్రజలు ఎవరు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదని భట్టి అన్నారు. దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజున
ప్రజల దగ్గరకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రజాపాలన తెలంగాణలో మొదలైందన్నారు.

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట తాను పాదయాత్ర చేసిన సమయంలో మహిళలు వారి సమస్యలు చెప్పుకున్నారని భట్టి వివరించారు. “గతంలో కాంగ్రెస్‌ పంచిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని చెప్పారు. అడిగినందుకు వేధించారని, ప్రశ్నిస్తే కేసులు పెట్టిన బిఆర్ఎస్ పాలన మాకొద్దు. ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ పోలీస్ వ్యవస్థలతో పాటు ప్రతి సంస్థ వ్యవస్థ నా కోసమే ఉందన్న భావన ప్రతి పౌరుడికి కలిగించే బాధ్యతగా ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్య పాలన ఉంటుందన్నారు.

నాడు పాదయాత్రలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్ కువచ్చిన సందర్భంగా ఇండ్లు లేని పేద ప్రజలు తనను కలిశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం నేడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకునే లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా, పంచాయతి రాజ్ కమిషనర్ హన్మంతరావు,
కలెక్టర్ గౌతమ్ పొట్రు, రాచకొండ సి.పి జి. సుదీర్ బాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.