Read News in Telugu Language
adsdaksha

సీఎం అల్పాహార పథకం ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రారంభించారంటే..

దక్ష న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 6

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 1 నుంచి 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులందరికీ బలవర్ధకమైన బ్రేక్ ఫాస్ట్ (ఉపాహారం)ను అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ( cm kcr ) ఆదేశాలమేరకు మంత్రులు కెటిఆర్ ( ktr ), హరీశ్ రావు ( harish rao ) సహా రాష్ట్రవ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్లు, అధికారులు సిఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ( cm breakfast scheme )  ఉత్సాహభరిత వాతావరణంలో, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోలాహలం నడుమ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ పథకాన్ని ప్రారంభించారో చూద్దాం.

– సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్ మారేడ్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రి కేటీఆర్ లాంభనంగా ప్రారంభించారు.
విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. బ్రేక్ ఫాస్ట్ పోషకాలతో చాలా రుచిగా ఉందని కేటీఆర్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ దార్శనికతే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని కేటీఆర్ అన్నారు.

– రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జిల్లా పరిషత్ స్కూల్ లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని, మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
ఈ పథకం విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెస్తుందని హరీష్ రావు అన్నారు.

మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు పాటిల్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎడ్యుకేషన్‌, వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి, విద్యా శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.

– ఖమ్మం జిల్లా కేంద్రం రోటరీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ పథకాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ పాలనలో కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఆవిర్భవించాయని ఆయన అన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

– వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డి పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్, ఎంపీపీ చంద్రకళ తదితరులు మంత్రితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

– నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని సోన్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ముఖ్య‌మంత్రి అల్పాహారం ప‌థ‌కాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఆకలి బాధలు లేకుండా పిల్లలు పాఠశాలకు హాజరయ్యేలా చూడడంతో పాటు పోషకాహార స్థితిని మెరుగుపరచడం, పాఠశాలల్లో విద్యార్థులు హాజరు శాతం పెంచడం వంటి లక్ష్యాలతో సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఈ పథకాన్ని తెచ్చారని కొనియాడారు.

Hospital

– నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వోన్నత ప్రాథమిక పాఠశాలలో “సీఎం బ్రేక్ ఫాస్ట్” కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. కేసిఆర్ జనరంజక పాలనలో భాగంగా మానవీయ కోణంలో ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. పేదవారు కూడా ప్రపంచంతో పోటీ పడేలా కేసీఆర్ విద్యారంగాన్ని తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్,జిల్లా విద్యాధికారి,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,స్కూల్ హెచ్.ఎం ,టీచర్లు,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

– అమీర్ పేట్ డికె రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యాచరణతో పాఠశాలల రూపురేఖలు, విద్యార్థుల సామర్థ్యం మెరుగుపడుతున్నాయని మంత్రులు తెలిపారు.

– మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో “ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని” మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు అల్పాహారంతో పాటు, మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని అన్నారు.

– కరీంనగర్ జిల్లా రూరల్ మండలంలోని మొగ్దూంపూర్ గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ లతో కలిసి సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు చదువు పై ఏకాగ్రతను పెంచే బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించే దిశగా సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి అన్నారు.

– సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకంతో విద్యావ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయని, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు కు బలవర్ధకమైన బ్రేక్ ఫాస్ట్ పథకం నాంది పలకనుందని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు, అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక, డి.ఈ.ఓ అశోక్, మున్సిపల్ చైర్మన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్, కమీషనర్ రామానుజుల రెడ్డి, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

– హన్మకొండ లష్కర్ బజార్ లోని ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కలిసి ప్రారంభించారు. పేద విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం అద్భుతం అని మంత్రులు కొనియాడారు.

– బాన్సువాడ నియోజకవర్గంలోని జక్కలదాని తాండా (జెకే తాండా) ప్రాథమిక పాఠశాలలో “ముఖ్యమంత్రి అల్పాహారం” పథకాన్ని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించినందుకుగాను ముఖ్యమంత్రి కి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు.

– సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట ప్రభుత్వ స్కూల్ లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రారంభించారు. కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, డిప్యూటీ కమీషనర్ సుధాంశు, ఇంజినీర్ ఆశా లతా, ప్రిన్సిపాల్ మధుసూదన్ రెడ్డి, విద్యాధికారులు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

– సీఎం అల్పాహార పథకం అమలుతో విద్యార్ధుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. విద్యార్థినీ,విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యార్ధుల పట్ల ఉన్న ప్రత్యేక శ్రద్ధకు సంతోషం వ్యక్తం చేశారు. తమకోసం తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణలతో తెలంగాణ విద్యారంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.