Read News in Telugu Language
adsdaksha

నేడే కేబినెట్ భేటీ..రుణమాఫీ నిధుల సమీకరణపై జరగనున్న చర్చ.. పునర్విభజన అంశాలపై నిర్ణయం..

దక్ష న్యూస్, హైదరాబాద్: మే 18

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం శనివారం ఏర్పాటు కానుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కేబినేట్ సమావేశం కానుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లోని అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినేట్​ భేటీలో చర్చించనున్నారు. ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజనపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్.. ఇప్పటికే అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలని, క్లిష్టమైన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు.

Read also: ఒరిస్సాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విస్తృత ప్రచారం ..

ప్రధానంగా పునర్విభజన కు సంబంధించి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఆగస్టు 15లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. దీని కోసం రూ. 34 వేల కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయని అంచనా.

Read also: గుర్తుకొస్తున్నాయి.. నా తండ్రికి, అమేథీకి ఉన్న ప్రేమకు నేనే సాక్షిని : చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రాహుల్ గాంధీ..

Hospital

రైతు సంక్షేమం, అభివృద్ది కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. ఇంత పెద్దమొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్న దానిపై రేవంత్‌కు క్లారిటీ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఇదీకాకుండా ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ జరుగనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినేట్‌లో చర్చిస్తారని తెలుస్తోంది.

కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

Read also: రాష్ట్ర మంత్రులను కలిసిన తీన్మార్ మల్లన్న .. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని కార్యకర్తలకు మంత్రుల పిలుపు..

విద్యా సంవత్సరం పైనా..

జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కూల్, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ ల పంపిణీ తదితర అంశాలను చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల పాలన అనంతరం ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను హడావుడిగా అమలు చేశారు. ఆ పథకాల అమలు తీరుపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు చర్చించనున్నారు. అలాగే నెరవేర్చాల్సిన హామీలు.. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపైనా మంత్రులతో .. కేబినెట్ భేటీ అనంతరం రేవంత్ చర్చించే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.