Read News in Telugu Language
adsdaksha

ప్రభుత్వం ప్రజలకు జవాబు దారీగా ఉండాలి.. ఇక మీదట సెక్రటేరియెట్‌లో మీడియా సెంటర్

దక్ష న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 28

రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన గురుతరమైన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు గుర్తు చేశారు. బుధవారం బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అసలైన ప్రజల తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని.. అందుకు అనుగుణంగా బడ్జెట్‌ను తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని, లేనిపోని గొప్పలు, ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. వాస్తవంగా రాష్ట్ర ఆదాయమెంత? ఉద్యోగుల జీతభత్యాలు, మనమిచ్చిన హామీలకు, చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతుంది? అని పక్కాగా అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని, ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం సూచించారు.

read also : ప్రజలకు పారదర్శకంగా నాణ్యమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించాలి: పొంగులేటి..

ఎవరో కొందరు వ్యక్తులను సంతృప్తిపరచాల్సిన పని లేదని, తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు మనముందున్న లక్ష్యాలు, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని ముఖ్యమంత్రి అన్నారు. దుబారా చేయకుండా, వృథా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని అన్నారు.

ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా ప్రత్యేక కసరత్తు చేయాలని సీఎం కోరారు. గతంలోలా అప్పులు దాచి, ఆదాయ వ్యయాలను భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేనే లేదని అన్నారు. ఉన్నది ఉన్నట్లు రాష్ట్ర ఆదాయ స్థితిగతులను జనం ముందు ఉంచాలని సూచించారు. అడ్డగోలు ఖర్చులు, అనవసర వ్యయం, దుబారా లేకుండా చూడాలని కోరారు.

Hospital

గత పదేళ్లలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదని, ప్రజావాణిలో వచ్చిన 24 వేల ఫిర్యాదులే అందుకు ఉదాహరణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు మోయలేని భారాన్ని గత పదేళ్లలో మోసారని అన్నారు. ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరకు వస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల వద్దకు నడిచి వెళ్తోందన్నారు.

read also : ప్రజాపాలనకు ఉమ్మడి జిల్లాల వారీగా నోడల్ అధికారుల నియామకం ..

ప్రజా పాలనలో ప్రజలకు తమ మీద మరింత విశ్వాసం కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో గడీల మధ్య పాలనా నడిచిందని.. ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల కోసం వారి వద్దకు వెళ్తుందన్నారు. ఒకప్పుడు సచివాలయం అంటే ఏదో తెలియదని, సచివాలయం లోపల మీడియా సమావేశం ఉంటుందని ఎవరైనా ఊహించారా అని అడిగారు. ఇక మీదట సెక్రటేరియెట్‌లో మీడియా సెంటర్ ఉంటుందన్నారు. మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. కేటీఆర్ లక్ష కోట్ల సంపాదన నుంచి లక్ష రూపాయలు బాధిత మహిళకు ఇచ్చారని, మిగతా సొమ్ము అంతా కక్కిస్తామని హెచ్చరించారు.

తప్పనిసరయితే తప్ప ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రకటనలు తగ్గించాలని, కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా, ఇప్పుడు ఉన్న వాహనాలనే వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో గెలువకముందే 22 ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలు చేసిన విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖలు, స్కీముల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్‌ను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.

read also : తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం: భట్టి

కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే.. కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో లేదా.. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పేరు వచ్చేది లేదనో బేషజాలకు పోవద్దని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి టి.కె. శ్రీదేవి, సంయుక్త కార్యదర్శి కె.హరిత, ఉపముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణభాస్కర్ సమావేశంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.