Read News in Telugu Language
adsdaksha

వైద్యోనారాయణ హరి.. అది దేహమైనా.. సమాజమైనా..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి 19

ఆయనో ఉన్నత విద్యావంతుడు.. చిన్నారుల మోముల్లో చిరునవ్వులు మాయం చేస్తున్న ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే వైద్య నారాయణుడు. కుటుంబమే సర్వస్వంగా..వైద్యమే పరమావధిగా సాగిపోతున్న అతడి జీవన ప్రయాణంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కల్లోలం రేపింది. రాష్ట్ర సాధన కోసం విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఆయనను అతలాకుతలం చేశాయి. కోటి ఆశలతో తల్లిదండ్రులు తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును కోరుకుంటే.. ఉద్యమం రగిల్చిన స్వరాష్ట్ర కాంక్ష వారిని అగ్నికి ఆహుతి చేయడం తట్టుకోలేకపోయిన ఆయన అమరుల ఆశయ సాధనే వారికిచ్చే నిజమైన నివాళి అని గ్రహించారు. స్వరాష్ట్ర సాధన అవశ్యకతను గుర్తించి జై తెలంగాణ నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. అగ్నికి ఆహుతి అవుతున్న శ్రీకాంతాచారి ఆక్రందనలు నిరంతరం చెవుల్లో మారుమోగు తుండగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. దాంతో తన వృత్తితో సమానంగా ఉద్యమాన్ని ఊపిరిగా భావించి రాష్ట్ర సాధన ఉద్యమానికి అంకితమయ్యారు. ఉద్యమంలో వైద్యుల పక్షాన జే ఏ సి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వర్తించారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా కొనసాగుతూ రాష్ట్ర ప్రయోజనాల పట్ల సామాజిక సృహను కొనసాగిస్తూనే .. ఉద్యమకారుల సమస్యలపై గొంతెత్తుతున్నారు. ఆయనే ఖమ్మం లోని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె.వి. కృష్ణారావు.

Read also: తెలంగాణలో టాటా గ్రూప్ మరో రూ.1500 కోట్ల పెట్టుబడులు ..

 

వైద్యం నుండి ఉద్యమం దాకా..

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ కృష్ణారావు 2007లో ఖమ్మంలో చిన్నారి పిల్లల ఆసుపత్రిని ప్రారంభించారు. పిల్లల వైద్యం లో తనకంటూ మంచి గుర్తింపును సాధించి అందరి వైద్యుల్లాగే వైద్యమే ప్రపంచంగా తన పని తను చేసుకుంటూ వీలైనప్పుడల్లా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ గడిపేవారు. కానీ 2009 లో ఊపందుకున్న తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో స్వరాష్ట్రం కోసం పాలుగారే పసిబుగ్గల అన్నెంపున్నెం ఎరుగని విద్యార్ధులు ఆత్మబలిదానాలు చేసుకోవడం ఆయనను కలచివేసింది. శ్రీకాంతాచారి నిలువునా కాలిపోతూ జై తెలంగాణ అని నినదించడం ఆయనను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాయి. మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు పరాయి రాష్ట్రానికి తరలిపోకుండా స్వరాష్ట్రం సాధించుకుంటే మన యువత భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయన్న బలమైన కాంక్షతో రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్దమైన యువత బలిదానాలు .. ఆక్రందనలు ఆయనను ఉద్యమ జెండాను భుజాలకెత్తుకునేలా చేశాయి. దాంతో జై తెలంగాణ నినాదంతో రోడ్డుపైకి రావడమే కాదు తెలంగాణ డాక్టర్స్ పోరం తరుపున ధూందాం కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ జేఏసిలో డాక్టర్ కృష్ణారావు క్రియాశీలకంగా పనిచేయడం చూసిన కల్వకుంట్ల కవిత జాగృతి జిల్లా కన్వీనర్ గా పనిచేయాలంటూ కోరారు. దాంతో 2010  నుండి 2014 వరకు  సంస్కృతి యాస బాష కోసం జేఏసీ, పొలిటికల్ జాగృతిలో పనిచేశారు. విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా అలుపెరుగని పోరాటం చేశారు. రోడ్డుపైన బైటాయించి తెగించి ఎందరిలోనో ఉద్యమ స్పూర్తిని రగిలించారు.

Hospital

Read also: అయోధ్య భోజనం ఖర్చు అంతా ప్రభాస్ దే..!

స్వరాష్ట్రం కల కల్లలయ్యాక ..

2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కోరి కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రం లో విద్యార్ధుల కలలు నెరవేరకపోగా, రాష్ట్ర సాధన లక్ష్యం కనుమరుగు కావడంతో కృష్టారావు మరో ఉద్యమానికి తెరలేపారు. సకల జనుల సమ్మెతో సబ్బండ వర్గాలు ఐక్య నినాదంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా ఉద్యమకారుల్ని సైతం తెలంగాణ ప్రభుత్వం విస్మరించడం ఆయనను మరో ఉద్యమానికి సిద్దమయ్యేలా చేసింది. దాంతో ఉద్యమకారుల ఫోరమ్ ను ఏర్పాటు చేసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా కార్యాచరణ ప్రారంభించారు. ఎన్నో సందర్భాల్లో ఉద్యమకారుల తరుపున తన గళాన్ని వినిపించారు. చివరికి 2023 ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే క్రమంలో ఉద్యమకారుల సమస్యలను తమ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేశారు.

యుద్ధం పూర్తి కాలేదు..

డాక్టర్ కె.వి. కృష్ణారావు

అగ్నికి ఆహుతవుతున్న యువత ఆత్మబలిదానాలనుండి అందుకున్న జై తెలంగాణ నినాదం .. పోరాట స్పూర్తి, స్వరాష్ట్ర సాధనతో చల్లారలేదు. రాష్ట్రం సిద్దించాక పాలన పట్ల టిఆర్ఎస్ పార్టీ పాలకుల నిర్లక్ష్యం .. స్వార్ధం.. రాష్ట్రాన్ని దగా చేసిన తీరు గాయపడ్డ హృదయాలను రంపపు కోతకు గురిచేశాయి. సకలజనుల సమ్మెతో సాధించిన రాష్ట్రంలో అదే జనం గత పాలకులకును తరిమికొట్టారు. కానీ ఇంతటితో యుద్థం పూర్తయిందని భావించడంలేదు. నీళ్ళు, నిధులు, నియామకాలు ప్రాతిపదికన ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరినప్పుడే స్వరాష్ట్ర సాధనకు సార్థకత. అప్పటి వరకు ఉద్యమకారులమంతా నిత్య సైనికులమే.

Leave A Reply

Your email address will not be published.