Read News in Telugu Language
adsdaksha

దివ్యాంగులను కించపరిచే పదాలు వాడొద్దు..ఈసీఐ..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ: డిసెంబర్ 21

రాజకీయ పార్టీలు తమ బహిరంగ చర్చల్లో దివ్యాంగులను కించపరిచే పదాలు వాడొద్దని ఎన్నికల సంఘం సూచించింది. నాయకులు, అభ్యర్థులు తమ ప్రసంగాల్లో అటువంటి అభ్యంతరకరమైన భాషను వాడటం దివ్యాంగులను అవమానించడమేనని హెచ్చరించింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు కొన్ని మార్గదర్శకాలను ఈసీ విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియలో అన్ని వర్గాలు భాగస్వాములు కావడంలోనే ప్రజాస్వామ్య పునాదులు ఉన్నట్లుగా తెలిపింది. సాధారణంగా దివ్యాంగులను ఉద్దేశించి వాడే అభ్యంతరకరమైన పదాలకు సంబంధించి ఈసీ కొన్ని ఉదాహరణలు ఇచ్చింది. రాజకీయ ప్రసంగాల్లో మూగ (గూంగా), బుద్ధిమాంద్యులు (పాగల్‌), గుడ్డి (అంధా), చెవిటి (బెహ్రా), కుంటి (లంగ్డా, లూలా, అపాహిజ్‌) వంటి పదాల వాడకం పరిహరించాలని సూచించింది.

Read also: ఆధార్‌తో ఆస్తుల అనుసంధానమై, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం….

Hospital

నేతల ప్రచారాల్లో, రాతల్లో దివ్యాంగులను గౌరవంగా, న్యాయంగా సంబోధించాలని ఈసీ హితవు పలికింది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను కచ్చితంగా మానుకోవాలని దివ్యాంగులను అవమానించేలా, అపహాస్యం చేసేలా మాట్లాడితే వికలాంగుల హక్కుల చట్టం – 2016లోని సెక్షన్‌ 92 వర్తిస్తుందని హెచ్చరించింది.

రాజకీయ పార్టీలు దివ్యాంగులను తమ సభ్యులుగా, కార్యకర్తలుగా చేర్చుకొని సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నికల సంఘం సూచన చేసింది. నేతల ప్రసంగాలు, ప్రచార సామగ్రి, సామాజిక మాధ్యమ పోస్టులు, ప్రకటనల విషయంలో ఆయా పార్టీలు అంతర్గత సమీక్ష విధానం పెట్టుకొని.. దివ్యాంగులను సమానదృష్టితో, గౌరవప్రదమైన భాషతో ఆదరిస్తామని వారి వెబ్‌సైట్ల ద్వారా ప్రకటించాలని ఈసీ కోరింది. దివ్యాంగుల పట్ల అనుసరించాల్సిన వైఖరికి సంబంధించి రాజకీయ పార్టీలు కార్యకర్తలకు తగిన శిక్షణ ఇచ్చి, ఫిర్యాదుల పరిష్కారానికి నోడల్‌ అథారిటీని నియమించాలని కూడా ఎన్నికల సంఘం సూచించింది.

Leave A Reply

Your email address will not be published.