Read News in Telugu Language
adsdaksha

ప్రతి పేదవానికి స్వంత ఇంటి కల నెరవేర్చే దిశగా చర్యలు..మంత్రి పువ్వాడ

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 23

ప్రతి పేదవానికి స్వంత ఇంటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. శనివారం స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో నగరంలోని 5,7,9,10,11,12, 20,32,37,38,47 డివిజన్లలోని లబ్దిదారులకు 58 జీవో క్రింద పట్టాలు, గృహాలక్షి ( gruhalakshmi ) పథక మంజూరు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాల్లో 2020 నాటికి నివాసం ఉంటున్న పేదలకు జీవో 58 క్రింద ఆధీనంలో ఉన్న ఇంటి స్థలంపై వారికే పూర్తి హక్కులు కల్పించి, నిశ్చింతగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు.

ఇంటి స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే ఆర్ధిక స్తోమత లేని వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించేందుకు గృహలక్ష్మి పథకానికి రూపకల్పన చేయడం జరిగిందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. నివాస దృవ పత్రాల ఆధారంగా మీ సేవ ద్వారా దరఖాస్తు సమర్పించిన అర్హులందరికి క్షేత్రపరీశీలన చేసి పారదర్శకంగా మొదటి విడతగా 3 వేల 2 వందల 53 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి పేదవారికి స్వంత ఇల్లు ఉండాలనే మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల సంకల్పంతో పట్టణంలో ఇప్పటికే 2 వేల మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

read also : జర్నలిస్టుపై దాడులను అరికట్టాలి : మాచర్ల

స్వంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్తోమత లేని వారికి ఆర్ధిక చేయూత నందించేందుకు గృహలక్ష్మి పథకం క్రింద మూడు లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించేందుకు నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున జిల్లాలో 15 వేల 5 వందల మంది లబ్ధిదారులకు మూడు విడతలుగా బేస్‌మెంట్‌, స్లాబ్‌ లెవల్‌, నిర్మాణం పూర్తి దశలలో ఒక్కో లక్ష రూపాయల చొప్పున మూడు లక్షలు అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

Hospital

ఖమ్మం నియోజకవర్గానికి అదనంగా మరో వేయి గృహాలక్ష్మి ఇండ్లు మంజూరు చేశారని, దీంతో నియోజకవర్గంలో 4 వేల ఇండ్లు గృహాలక్ష్మి క్రింద మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. నగరంలోని ఇప్పటికి 2 వేల డబుల్ బెడ్ రూమ్ లు రూ. 120 కోట్లతో, రూ. 120 కోట్లు గృహాలక్ష్మి పథకానికి, మొత్తంగా రూ. 240 కోట్లు ప్రభుత్వం అందజేసిందని ఆయన అన్నారు. జీవో 58 క్రింద నగరంలో దాదాపు 5 వేల మంది పేదలకు ఇండ్ల స్థల పట్టాలు ఇస్తున్నట్లు ఇట్టి స్థలం ధర రూ. 250 కోట్లకు తక్కువ ఉండదని ఆయన తెలిపారు.

ప్రభుత్వం ఒక్క ఖమ్మం నగరంలోని ఇండ్లు, ఇండ్ల స్థలాలకు రూ. 500 కోట్లు అందించిందని మంత్రి తెలిపారు. గృహాలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, ప్రతి అర్హులైన పేదవారికి పథక లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. రాష్ట్ర ఐటి, పురపాలన శాఖ మంత్రి కే. తారకరామారావు ఈ నెల 30న జిల్లాలో పర్యటించి, రూ. 1266 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారని మంత్రి అజయ్ కుమార్ తెలిపారు.

read also : కొలంబో మంత్రిని కలిసిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్..

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం వుంటున్నవారికి జీవో 58 ఒక వరప్రసాదమని అన్నారు. తర తరాలుగా ఉంటున్న ఇప్పటి వరకు ఆ స్థలంపై హక్కు లేక, ఏ రోజు తమ స్థలం పోతుందో అని భయంగా వుండేవారన్నారు. అలాంటి వారి స్థితిగతులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి హక్కు కల్పించాలనే సంకల్పంతో జీవో 58 క్రింద రెగ్యులరైజ్‌ చేయాలని ఆదేశించిందన్నారు. ప్రతి లబ్ధిదారుని వద్దకు వెళ్లి, విచారణ చేసి, లబ్ధిదారులచే దరఖాస్తు చేయించి వారికి పట్టా వచ్చేలా జిల్లా అధికారులు, మున్సిపల్‌ అధికారులు, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, తహశీల్దార్లు కృషి చేసినట్లు, ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపట్టినట్లు తెలిపారు.

జీవో 58 అమలులో ఖమ్మం జిల్లా ముందంజలో ఉందని, గృహాలక్ష్మి పథక మంజూరులు లబ్దిదారులకు అందజేయడం జిల్లాలోనే ప్రారంభం అయినట్లు కలెక్టర్ తెలిపారు. 315 మందికి జీవో 58 పట్టాలు, 215 మందికి గృహాలక్ష్మి పథక మంజూరు ఉత్తర్వులు మంత్రి చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, డి.సి.సి.బి చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, ఏఎంసి చైర్ పర్సన్ దోరేపల్లి శ్వేత, నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, డిప్యూటీ కమీషనర్‌ మల్లీశ్వరీ, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్‌, ఖమ్మం అర్బన్ తహశీల్దారు స్వామి, కార్పోరేటర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.