Read News in Telugu Language
adsdaksha

అంబరాన్నంటిన వజ్రోత్సవ సంబురం.. ఆకట్టుకున్న సాంస్కృతిక సంరంభం..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 1

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల ( swatantra bharat vajrotsavam ) ముగింపు వేడుక శుక్రవారం హైదరాబాద్ ( hyderabad ) లో అంగరంగ వైభవంగా వీక్షకులకు కన్నుల పండువ చేసింది. అత్యంత శోభాయమానంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టాయి. హెచ్ ఐసీసీ ( hicc) వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు సీఎం కేసిఆర్ ( cmkcr ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మధ్యాహ్నం మూడు గంటలకు వేదిక ప్రాంగణం చేరుకున్న సిఎం కి పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( shanthikumari ), డీజీపీ అంజన్ కుమార్ యాదవ్ ( dgp anjan kumar yadav ), ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం సీఎం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి న సీఎం కేసిఆర్ సాయుధ దళాల వందన సమర్పణ స్వీకరించారు. జాతీయ గీతాలాపన అనంతరం వేదిక వద్దకు చేరుకున్న సిఎం వేదిక ముందు ఏర్పాటు చేసిన గాంధీ మహాత్ముడి విగ్రహానికి , భరత మాత చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాల్ని తిలకించారు.

read also : cm kcr : గాంధీ మార్గంలో ఉద్యమించడం వల్లే రాష్ట్ర స్వప్నం సాకారమైంది..

Hospital

ఈ సందర్భంగా తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ( telangana bhasha samsruthika shaka ), సంగీత నాటక అకాడమీ ( sangheetha nataka academi ) ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. వేడుకల్లో రాష్ట్ర సమాచార శాఖ, వారోత్సవాల ముగింపు సందర్భంగా రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వీక్షించారు. అనంతరం.. రాఘవాచారి బ్రదర్స్ నిర్వహించిన ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే గానంతో సంగీత విభావరి ప్రారంభమైంది. ‘ఇదిగో భద్రాద్రి.. గౌతమి అదిగో చూడండి’ అంటూ చేసిన ఆలాపనతో పాటు, ’ఎందరో మహానుభావులూ..అందరీకీ వందనాలూ’ అంటూ సాగిన త్యాగరాజ కీర్తన సభికుల ను ఎంతగానో ఆకట్టుకుంది.

సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో రూపొందిన ‘భారతీయ భావన’ అనే నాట్య రూపకం వీక్షకులను కట్టిపడేసింది. ఇందులో కూచిపూడి, భరత నాట్యం, పేరిణి, మోహినీ అట్టం, ఒడిస్సితో పాటు ఆరు రకాల భారతీయ నృత్యరీతులతో కూడిన ఏక ప్రదర్శన సబికుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఆయాచితం నటేశ్వర శర్మ రాసిన ‘తెలంగాణ అవతరణం తెలంగాణ అవతరణం.. తొలిపొద్దు నవకిరణం.. భరత మాత ఆభరణం’ అంటూ సాగిన నృత్య ప్రదర్శన.. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు , రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒకొక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని వర్ణిస్తూ సాగింది. ఈ నృత్య రూపకం సిఎం కేసీఆర్ దార్శనికతను, రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించింది. సకల జనుల కు అందుతున్న ప్రగతి ఫలాల ఔన్నత్యాన్ని ఆవిష్కరించింది. భావోద్వేగానికి గురిచేసింది.

read also : వాషింగ్టన్ డీసిలో తెలంగాణ మంత్రి.. మన గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించాయి. .

అనంతరం ‘ సింఫనీ ఆఫ్ ఫ్రీడం’ పేరిట సాగిన పలు వాయిద్యా లతో సాగిన జూగల్బందీ ఆద్యంతం ఆకట్టుకుంది. తబలా ఫ్లూటు ఘటం గిటారా డప్పు తదితర వాయిద్యాలతో కొనసాగిన సంగీతం ప్రేక్షకులను కట్టిపడేసింది. అనంతరం మంజుల రామస్వామి బృందంచే ప్రదర్శించిన ‘వజ్రోత్సవ హారతి’ నృత్య ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో కళాకారుల నృత్య భంగిమలు చూపరులను కట్టిపడేశాయి. ప్రేక్షకులు ఈ నృత్య ప్రదర్శనను కళ్లార్పకుండా వీక్షించారు. జయహో అంటూ సాగిన మరో నృత్యం దేశభక్తిని రగిలించింది. దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. మొత్తంగా వజ్రోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కరతాల ధ్వనులతో ఆద్యంతం సభ మారుమోగింది.

 

 

Leave A Reply

Your email address will not be published.