Read News in Telugu Language
adsdaksha

గుండెల నిండుగా జెండా పండుగ..

దేశాభిమానం పెంపొందించే దిశగా ప్రభుత్వ చర్యలు ..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసిఆర్ ప్రసంగం..

బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు స్వాతంత్ర్య దినోత్సవం ( independence day ) సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నానని తెలంగాణ ( telangana) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ( kcr) అన్నారు. గత ఏడాది భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నామని, ఇప్పుడు వజ్రోత్సవాల సమాపన ఘట్టాన్ని కూడా అంతే ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి హృదయంలో దేశాభిమానం పెంపొందించే విధంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

75 ఏళ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా, ఆశించిన లక్ష్యాలను, చేరవల్సిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదని సీఎం కేసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్థత, భావదారిద్ర్యం ఫలితంగా వనరుల సద్వినియోగం జరగడంలేదు. అన్నీఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల జీవితాల్లో అలుముకొన్న పేదరికం ఇప్పటికీ తొలగిపోలేదు. వనరులను సంపూర్ణంగా వినియోగించుకొని ప్రగతి ఫలాలు అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే సాధించుకున్న స్వాతంత్ర్యానికి సార్థకత అని సవినయంగా మనవి చేస్తున్నా అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని పేర్కొన్నారు.

సమైక్య పాలనలో తెలంగాణలోని అన్నిరంగాలూ విధ్వంసమైపోయాయని సీఎం కేసిఆర్ అన్నారు. నాటి తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ముకాస్తూ చేవచచ్చి చేష్టలుడిగి ప్రవర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైందన్నారు. తెలంగాణ ప్రజలందరూ ఒక్కతాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజాఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని గుర్తు చేశారు. పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవనచిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దు:ఖం తన్నుకొస్తదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటుచూసినా పడావుపడ్డ పొలాలు, పూడుకుపోయి తుమ్మలు మొలిచిన చెరువులు, ఎండిపోయి దుబ్బతేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతాళం లోతుకు పోయినా చుక్క నీరుకానరాని బోర్లు, ఎడతెగని కరంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరంటు షాకుకో, పాము కాటుకో బలైపోయిన రైతన్నల జీవితాలు, అప్పుల ఊబిలో చిక్కి ఆశలు సైతం అడుగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు, బతుకుమీద ఆశ చచ్చి ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు, యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు, ఇండ్లకు తాళాలు పడి గడ్డి మొలుస్తున్న గోడలు, మొరం తేలిన వాకిళ్లు, ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు, గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డు పరిస్థితులు. అటువంటి అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్రయజ్ఞంగా నిర్వహించిందన్నారు. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధోమధనంతో అవిశ్రాంతంగా శ్రమించి విధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాసపథం వైపు నడిపించిందన్నారు.

read also : ప్రగతి భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ఎరిగిన ప్రభుత్వం కనుక, దానికి అనుగుణంగా అన్నిరంగాలనూ ప్రక్షాళన చేసినట్లు సీఎం కేసిఆర్ తెలిపారు. అనతి కాలంలోనే తిరుగులేని ఫలితాలను సాధించిందన్నారు. అనేక రంగాలలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిందన్నారు. దార్శనిక దృక్పథంతో, పారదర్శక విధానాలతో, అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కింది. తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది అనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచిందన్నారు.

నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే.. నిరంతర విద్యుత్తు ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నదని సీఎం కేసిఆర్ అన్నారు. పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. తరలివస్తున్న కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతున్నది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇపుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. సంక్షేమంలో, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నది. దశాబ్దకాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నది. ఈ అద్భుతమైన పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా తెలంగాణ ప్రజలు తమ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని ఇదే రీతిన అందించాలని హృదయ పూర్వకంగా మనవి చేస్తున్నానన్నారు.

read also : భారత్‌కు నారీ శక్తి, యువశక్తి బలం..

ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశం గానీ, ఒక రాష్ట్రం గానీ సాధించిన ప్రగతికి ప్రమాణంగా చూసే ప్రబల సూచికలు రెండే రెండు అని సీఎం అన్నారు. 1. తలసరి ఆదాయం 2. తలసరి విద్యుత్తు వినియోగం. ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచిందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పటిష్టమైన క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసింది. సంపద పెంచిందని, ప్రజలకు పంచిందని తెలిపారు. దేశంలో స్థిరపడిన పెద్ద రాష్ట్రాలను అధిగమించి నూతన రాష్ట్రం తెలంగాణ 3 లక్షల 12 వేల 398 రూపాయల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అదేవిధంగా తలసరి విద్యుత్తు వినియోగంలో జాతీయ సగటు అయిన 1,255 యూనిట్లను అధిగమించింది. దేశ సగటుకంటే 70శాతం అత్యధికంగా 2,126 యూనిట్ల సగటు వినియోగంతో తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ – 1 గా నిలిచిందని పేర్కొన్నారు.

వెలుగు జిలుగుల తెలంగాణ

Hospital

విద్యుత్తు రంగంలో తెలంగాణది స్ఫూర్తిదాయకమైన విజయగాథ అని కేసిఆర్ అన్నారు. అనతికాలంలోనే అన్నిరంగాలకూ 24 గంటలపాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. విద్యుత్తు రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి అన్నిరంగాలనూ ప్రభావితం చేసిందన్నారు. రాష్ట్రం ప్రగతిపథంలో పయనించేందుకు నిరంతర విద్యుత్తు చోదకశక్తిగా పనిచేసిందని పేర్కొన్నారు.

అతివృష్టి – సహాయ చర్యలు
రాష్ట్రంలో గత నెలలో అనూహ్యంగా, అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అతివృష్టి పరిస్థితులను అంచనా వేస్తూ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు సీఎం వివరించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి,ఆయా ప్రదేశాలకు సుశిక్షితులైన సిబ్బందినీ, పడవలనూ, ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలను, భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లను వినియోగించినట్లు తెలిపారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయ శిబిరాలు ఏర్పాటుచేసి ఆదుకున్నది. తక్షణ సహాయ చర్యల కోసం ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు.
అతివృష్టి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటుందని, దెబ్బతిన్న ఇళ్ళకు గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం సాయం అందిస్తుందన్నారు. వరదలలో కోతకు గురైన పొలాల సంఖ్యను అంచనా వేయడం జరుగుతున్నట్లు తెలిపారు.

రైతు సంక్షేమం
రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసిఆర్ అన్నారు. సమైక్య పాలన సృష్టించిన వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటుంన్నట్లు వెల్లడించారు. స్వరాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే అప్పటివరకు రైతులకున్న పంట రుణాలను సంపూర్ణంగా మాఫీ చేసిందన్నారు. రెండోసారి అధికారంలోకి రాగానే మరోసారి పంటరుణాల మాఫీ చేపట్టింది. మొత్తంగా తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండు దశల్లో రాష్ట్రంలోని రైతులకు చెందిన దాదాపు 37 వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. దేశం మొత్తంమీద రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదని నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని సవినయంగా తెలియజేస్తున్నానన్నారు.

read also : దండగన్న వ్యవసాయాన్ని కేసిఆర్ పండుగ చేశారు..

మిషన్ కాకతీయ, పెండింగు ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం తదితర చర్యల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సాగునీటిరంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందని సీఎం కేసిఆర్ వ్యాఖ్యానించారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయరంగాన్ని అద్భుతంగా స్థిరీకరించి, భారత దేశ వ్యవసాయ రంగ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏలుబడిలో సాగుబడి సుసంపన్నమైంది. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు పంజాబును ఢీకొంటూ దేశంలోనే ప్రథమ స్థానానికి పోటీపడుతున్నది. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఇంతటి ఔన్నత్యాన్ని సాధిస్తుంటే, కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారు.

పోడు భూములకు పట్టాలు..
దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ, గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ప్రభుత్వం వారిలో ఆనందం నింపిందని కేసిఆర్ పేర్కొన్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ 1 లక్షా 50 వేల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకుపైగా పోడు భూములపై యాజమాన్య హక్కులు కలిగించామన్నారు. వారందరికీ రైతుబంధు పథకాన్ని సైతం వర్తింపజేస్తూ పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. పోడు భూముల కోసం జరిగిన ఆందోళనల్లో నమోదైన కేసుల నుంచి విముక్తులను చేశామన్నారు.

డబుల్ బెడ్రూం ఇండ్లు – గృహలక్ష్మి పథకం
గతంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన నివాసం చాలీచాలని ఒకే ఒక్క ఇరుకుగది. అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా రెండు పడకగదులతో ఇండ్లు నిర్మించి ఉచితంగా అందిస్తున్నదన్నారు. దీన్ని ఒక నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తున్నదని,
హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 1 లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నేటినుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నదన్నారు. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.
ముందుగా, ప్రతీ నియోజకవర్గంలో 3 వేలమందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నది. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించినట్లు వివరించారు.

ఇంటింటికీ సురక్షిత జలాలు..
తాగునీటి సమస్యను సంపూర్ణంగా పరిష్కరించిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే. మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇండ్లల్లో ఉచితంగా ప్రభుత్వమే నల్లాలను బిగించి, సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నది. ఇప్పుడు రాష్ట్రంలో వీధి నల్లాల అవసరం లేకుండా పోయింది. మహిళలు బిందెలతో వీధివీధి తిరగాల్సిన దుర్గతి తొలగిపోయింది. మిషన్ భగీరథకు నేషనల్ వాటర్ మిషన్ అవార్డు, జల్ జీవన్ అవార్డులతో సహా అనేక అవార్డులు, ప్రశంసలు లభించాయి. తెలంగాణ ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్రం పార్లమెంటు వేదికగా ప్రకటించింది.

సమస్త జనులకూ సంక్షేమ ఫలాలు
దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్నివర్గాల పేదలకూ సంక్షేమ ఫలాలను అందజేస్తూ తెలంగాణ సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తున్నది. తరతరాలుగా పేదరికంలో మగ్గిపోతూ వివక్షకు గురవుతున్నదళితజాతి స్వావలంబన కోసం ప్రభుత్వం తెలంగాణ దళితబంధు పథకం అమలు చేస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు దేశానికి దిక్సూచిగా నిలిచింది. ఈ పథకం ద్వారా ప్రయోజనాలు అందుకున్న కుటుంబాల విజయగాథలు నేడు దేశమంతటా ప్రతిధ్వనిస్తున్నాయి.
దళిత కుటుంబం తమకు నచ్చిన, వచ్చిన వృత్తి లేదా వ్యాపారాన్ని చేపట్టడం కోసం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 10 లక్షల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని నూటికి నూరుశాతం గ్రాంటుగా ప్రభుత్వం అందిస్తున్నది. ప్రభుత్వ లైసెన్సుతో చేసే లాభదాయక వ్యాపారాల్లో దళితులకు 15శాతం రిజర్వేషన్ను కల్పిస్తున్నది. లబ్దిపొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురై ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి వస్తే ఆదుకునేందుకు ప్రభుత్వం దళిత రక్షణ నిధిని సైతం ఏర్పాటు చేస్తున్నది. ఇదే తరహాలో బలహీన వర్గాల్లోని వృత్తిపనుల వారికీ, మైనారిటీ వర్గాలకూ కుటుంబానికి లక్ష రూపాయల వంతున ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నది.
దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద అందించే మొత్తాన్ని ప్రభుత్వం 6 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచడంతోపాటు, ఈ పథకం వర్తించే ఆలయాల సంఖ్యను కూడా పెంచింది.
ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం గొల్ల కుర్మలకుభారీ ఎత్తున గొర్రెల పంపిణీ, మత్స్యకారులకోసం చేపల పెంపకం వంటి చర్యలు చేపట్టింది. గీత కార్మికులకు ఈత, తాటి చెట్లపై పన్ను రద్దు చేసింది. పాత బకాయిలు మాఫీ చేసింది. మద్యం దుకాణాల లైసెన్సుల్లో గౌడ సోదరులకు 15శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నది. రైతు బీమా తరహాలో గీతన్నలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల బీమా కల్పించింది.

read also : జర్నలిస్ట్ కుటుంబానికి పొంగులేటి భరోసా..

నేతన్నలకు వరాలు..
నేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వారికోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. నూలు రసాయనాలపై 50శాతం సబ్సిడీని అందజేస్తూ నేతన్నకు చేయూతనిస్తున్నది. గుంటమగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందించడం కోసం ‘‘తెలంగాణ చేనేత మగ్గం’’ అనే కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. నేతన్నలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల రూపాయల బీమాను కల్పిస్తున్నది.

దివ్యాంగులకు పెన్షన్ పెంపు
తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆసరా పెన్షన్లను వాసిలోనూ, రాశిలోనూ పెంచింది. అసహాయులకు జీవన భద్రతకోసం అందించే పెన్షన్ను 200 నుంచి 2,016 రూపాయలకు పెంచింది. 2014 నాటికి ఆసరా లబ్దిదారుల సంఖ్య కేవలం 29 లక్షలు. నేడు ఆసరా పెన్షన్లు అందుకుంటున్న లబ్దిదారుల సంఖ్య 44 లక్షలు. వృద్ధులు, వితంతువులు,దివ్యాంగులతో పాటు బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ సౌకర్యం కల్గించింది. పెన్షన్ పొందేందుకు వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించింది. ప్రభుత్వం ఇటీవల దివ్యాంగుల పెన్షన్ను 3016 నుంచి 4016 రూపాయలకు పెంచింది. తద్వారా దివ్యాంగుల బతుకుల్లో మరింత ధీమాను నింపింది. ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీనం, వైద్యారోగ్య రంగంలో అద్భుత ప్రగతి, అనాథల పిల్లలకు Orphan Policy ప్రత్యేక పథకం, ఉద్యోగులకు ఉత్తమ పీఆర్సీ, వీ.ఆర్.ఏ.లకు పేస్కేల్, హైదరాబాద్ నలుమూలలకు మెట్రో, పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి, విద్యారంగ వికాసం, మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ప్రగతి, తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే అంశాలన్నారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తినీ, విలువలను ముందుకు తీసుకుపోయే క్రమంలో యావత్ భారతజాతి ఒక్కటిగా నిలవాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.