కొరియాతో సాంస్కృతిక, ఆర్థిక బంధాలకు తెలంగాణ సర్కారు ప్రాధాన్యం..
ఉద్యోగాల కల్పన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి ప్రాధాన్యం
మూడు లక్షల అదనపు ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక
27 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ
ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఔషధ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం..
కొరియా సంస్థలతో భాగస్వామ్యాన్ని విస్తరిస్తాం..
కె హార్మనీ ఫెస్టా – కొరియా సాంస్కృతిక దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..
Korea : కొరియా సంస్థల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, యువత నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక తయారీ, లైఫ్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో కొరియా సంస్థలతో కలిసి పనిచేసేందుకు తెలంగాణలో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం నిర్వహించిన కె హార్మనీ ఫెస్టా–కొరియా కల్చర్ డే 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.
Korea : 2024 ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాలో చేపట్టిన పర్యటన సందర్భంగా జరిగిన పెట్టుబడుల చర్చలు రెండు ప్రాంతాల మధ్య ఆర్థిక భాగస్వామ్యానికి పునాది వేశాయని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కొరియా ఆర్థిక ప్రగతి నుంచి తెలంగాణ నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని, విద్య, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సాంకేతికతపై నిరంతర పెట్టుబడులు అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
Korea : పరిశ్రమలతో పాటు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. పర్యాటక రంగంలోనూ కొరియా పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక విధానం 2025–2030 ద్వారా రూ.15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, అదనంగా మూడు లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. పర్యాటక మౌలిక సదుపాయాలు, ఆతిథ్య రంగం, చలనచిత్ర పర్యాటకం, వెల్‌నెస్ టూరిజం, సాంస్కృతిక అనుభవాల అభివృద్ధిలో కొరియా సంస్థల భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

భారత్–కొరియా మధ్య సాంస్కృతిక బంధం
Korea : కొరియా సంస్కృతి, కళలు, సంగీతం, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుక రెండు దేశాల ప్రజల మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
యుద్ధం, పేదరికం వంటి సవాళ్లను అధిగమించి కొరియా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని కొనియాడారు. సాంకేతికత, తయారీ, విద్య, ఆవిష్కరణల్లో ఆ దేశం సాధించిన విజయాలు ప్రశంసనీయమన్నారు. కొరియన్ సంగీతం, సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షిస్తున్నాయని, సాంస్కృతిక ప్రభావం కూడా ఒక దేశ అంతర్జాతీయ గుర్తింపును పెంపొందిస్తుందని పేర్కొన్నారు. భారత్, కొరియా ప్రజల మధ్య విద్య, కుటుంబ వ్యవస్థ, సంప్రదాయాలు, పెద్దల పట్ల గౌరవం వంటి అంశాల్లో సారూప్యతలు ఉన్నాయని తెలిపారు. ప్రాచీన భారతదేశం నుంచి కొరియాకు వెళ్లినట్లు విశ్వసించే రాణి హియో హ్వాంగ్-ఓక్ గాథ రెండు దేశాల మధ్య చారిత్రక స్నేహానికి ప్రతీకగా నిలిచిందన్నారు.
తెలంగాణ వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు
విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాల కలయికకు హైదరాబాద్ శతాబ్దాలుగా కేంద్రంగా నిలిచిందని చెప్పారు. బతుకమ్మ, బోనాలు, తెలుగు సాంస్కృతిక వారసత్వం, చారిత్రక కట్టడాలు తెలంగాణ ప్రత్యేకతలని వివరించారు. చార్మినార్, గోల్కొండ కోట, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయం సహా రాష్ట్రంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనం వంటి బౌద్ధ వారసత్వ ప్రదేశాలు భారత్, తూర్పు ఆసియా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయగలవని అన్నారు. కొరియా పర్యాటకులు తెలంగాణను సందర్శించాలని, ఇరు ప్రాంతాల యువత చదువు, పరిశోధన, ఉద్యోగాలు, సృజనాత్మక రంగాల్లో పరస్పరం అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలు ముఖ్యమైనప్పటికీ, ప్రజల మధ్య ఆప్యాయత, పరస్పర అవగాహనే సంబంధాలకు శాశ్వత పునాది అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ కొరియా మిత్రులకు మరో ఇల్లు వంటిదని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు భారతదేశంలోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హెచ్.ఈ. లీ సియుంగ్-హో స్వాగతం పలికారు.




