Read News in Telugu Language
adsdaksha

మహాలయ పక్షాలలో ఏ రోజు కర్మలకు ఏం ఫలితమో తెలుసుకుందాం..

దక్ష న్యూస్, ఆధ్యాత్మికం.

నిత్యం మనం చేసే అన్నదానం ఇచ్చే పుణ్యం కన్నా, మహాలయపక్షం ( mahalaya paksham ) లో చేసిన అన్నదానం అనంత కోటి యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. మహాలయ పక్షాలు భాద్రపద బహుళ పాడ్యమి నుండి భాద్రపద అమావాస్య వరకు గల పదిహేను రోజుల సమయంగా చెప్తారు. ఈ పదిహేను రోజులను పితృ పక్షాలు అని అంటారు. ఈ సమయంలో పితృదేవతలకు చేయవలసిన శ్రాద్ధ కర్మలను నిర్వహించడం ఎంతో ఆవశ్యకమని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

ఈ కాలంలో పితృ దేవతలు తమ వారసులు పెట్టే పిండ ప్రదానాల కోసం ఎదురు చూస్తారట. మహాలయ పక్షాలలో మనం చేసే
ప్రతి దానానికి, ముఖ్యంగా తర్పణాలు, అన్న దానాలకు పితృ దేవతలు సంతుష్టులవుతారు. దీని గురించిన కథ ఒకటి ఉంది‌.

ఎన్నో దానాలు చేసి దాన కర్ణుడు గా పేరు పొందిన కర్ణుడు ఆహారం, నీరు దానం చేయనందుకు, అతడు చనిపోయిన తరువాత స్వర్గానికి వెళ్ళే దారిలో ఆకలి దప్పిక లతో అలమటిస్తూ, ఏది ముట్టుకున్నా బంగారంగా మారిపోసాగాయట. తన తండ్రి సూర్య భగవానుడిని ప్రార్ధించి, ఆయన కృపతో తిరిగి భూలోకానికి వచ్చి, 15 రోజుల పాటు విరివిగా అన్నం, నీరు దానం చేసి తిరిగి మహాలయ అమావాస్య రోజు స్వర్గానికెళ్లాడట.

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. ఇలా కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు.

సాధారణంగా గత జన్మలో తల్లితండ్రులకు లేదా ఎవరికైనా ఏవిధమైన కష్టాలను కలిగించినా ఆ వ్యక్తులకు పితృదోషం కలుగుతుందని శాస్త్ర వచనం. ఈ దోషాల కారణంగా ఎన్నో రకాలైన శారీరక, మానసిక, ఆర్ధిక మరియు కుటుంబ పరమైన సమస్యలను జనులు ఎదుర్కొంటారు.

ముఖ్యంగా ఈ మహాలయ పక్ష రోజులలో చేసే శ్రాద్ధ కర్మలవలన పితృదేవతలకు ఆకలి దప్పికలు తీరి వారు సంతృప్తి చెందుతారని మన శాస్త్ర వచనం. ప్రతి మాసంలో వచ్చే అమావాస్య తిథిని పుణ్య తిథిగా పేర్కొంటారు. ఆ రోజున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు, తర్పణాలు నిర్వర్తిస్తారు.

Hospital

ఈ మహాలయ అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. అందువలన ఈనాడు శ్రాద్ధం, దానం మరియు తర్పణాలను నిర్వహించినవారి పితృదేవతలు ముక్తిని పొందుతారు. పితృదేవతల ఆశీస్సులచేత వారి ఇంట్లో సకల సంతోషాలు కొలువుంటాయని శాస్త్ర వచనం. తమ పితరుల పుణ్య తిథులు తెలియనివారు ఈ మహాలయ అమావాస్యనాడు శ్రాద్ధకర్మలు జరిపిస్తారు. శ్రాద్ధకర్మలు భక్తి శ్రద్ధలతో జరిపించటం వలన సంతాన భాగ్యం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. శ్రాద్ధ కర్మలో నువ్వులు, బెల్లంతో కలిపిన అన్నం దానం చేయడం చేత, ఆ దానం అక్షయం అవుతుంది. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదని పెద్దలు చెప్పేరు.

మహాలయ పక్షాలలో ఏరోజు శ్రాద్ధ కర్మ చేయడం చేత ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని పురాణాలు చెప్పిన విషయాలను తెలుసుకుందాము:

మొదటి రోజు (పాడ్యమి) – ధన సంపద
రెండవ రోజు (విదియ) – రాజయోగం, సంపద
మూడవ రోజు(తదియ) – శతృనాశనం
నాల్గవ రోజు (చవితి) – ధర్మగుణం, ఇష్టకామ్యార్ధ సిద్ధి, శత్రు వ్యూహ రచన కూడా తెలుస్తుంది
ఐదవ రోజు (పంచమి) – ఉత్తమ లక్ష్మి ప్రాప్తి, పుత్రసంతాన ప్రాప్తి
ఆరవ రోజు (షష్టి) – శ్రేష్ఠ గౌరవం మరియు పితృదేవతల సంతృప్తి
ఏడవరోజు (సప్తమి) – యజ్ఞ కర్తృత్వ ఫలం
ఎనిమిదవ రోజు (అష్టమి) – సంపూర్ణ సమృద్ధి, దానం మరియు బుద్ధి
తొమ్మిదవ రోజు (నవమి) – సంపద, అనుకూలవతి అయిన భార్య
పదవరోజు (దశమి) – లక్ష్మీ ప్రాప్తి, పశుసంపద వృద్ధి
పదకొండవ రోజు (ఏకాదశి) – ఉత్తమ దాన ఫలం, సకల పాప నివృత్తి, వేద జ్ఞానం మరియు కుటుంబ వృద్ధి
పన్నెండవ రోజు(ద్వాదశి) – దేశాభివృద్ధి, అక్షయమైన ఆహార ప్రాప్తి, పుత్ర, పశు, బుద్ధి, మేధాశక్తి మరియు జయం
పదమూడవ రోజు(త్రయోదశి) – ధనం, సంతానవృద్ధి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రుల గౌరవం
పద్నాల్గవ రోజు(చతుర్దశి) – ఆయుధాల నుండి రక్షణ
పదిహేనవ రోజు (అమావాస్య) – సమస్త లాభాలు మరియు ఇష్టకామ్యములు నెరవేరుతాయి.

 

ఈ మహాలయ పక్షం పదిహేను రోజులలో శ్రాద్ధ కర్మలు చేయలేనివారు ఈ ఆఖరి రోజైన అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ జరిపించడం తప్పనిసరి. శక్తి కొలదీ శ్రాద్ధ కర్మలు జరిపించవచ్చును. శాస్త్రోక్తంగా ఐదుగురు భోక్తలను ఆహ్వానించి అన్ని రకాల కూరలు, పచ్చళ్ళు, పప్పు, పరమాన్నంతో పితరులను తృప్తి పరచవచ్చును. ఆర్ధిక స్తోమత లేని యెడల శాకంతో శ్రాద్ధం చేయవచ్చును. అది కుడా వీలు కాని పక్షంలో పశువులకు దాణా/గ్రాసం వేయవచ్చు. అది కూడా కుదరని పక్షంలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో నుంచుని చేతులు పైకెత్తి పితృదేవతలకు నమస్కరించినా పితృదేవతలు సంతోషిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి.

ఈ విధంగా మహాలయ పక్షాలు/ పిత్రుపక్షాలలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు జరిపించి పితృ దోషాలను తొలగించుకుని, పితృ దేవతల ఆశీర్వచనాలను అందుకుని సకల సౌభాగ్యాలతో వెలుగొందుతారని పెద్దలు సూచిస్తున్నారు.

– సత్యనారాయణాచార్యులు, హైదరాబాద్.

read also : మధుర మీనాక్షి అమ్మవారి పాదుకల వెనుక వాస్తవ గాధ..

Leave A Reply

Your email address will not be published.