Read News in Telugu Language
adsdaksha

తెలంగాణలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు : ఉప ముఖ్యమంత్రి భట్టి

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 23

రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు దేవాలయాల ఖాళీ భూముల్లో ఆలయ సందర్శకుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ( mallu bhatti vikramarka ) పేర్కొన్నారు. మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ శాఖల కు సంబంధించి బడ్జెట్ అంచనాల ముందస్తు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఎండోమెంట్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఎన్నో ప్రముఖ దేవాలయాలు, ప్రార్థనాలయాలున్న తెలంగాణా రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశం ఉందని, ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు మరింత ఎక్కువ సంఖ్యలో సందర్శించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెద్దగా ఆదాయం లేని దేవాలయాలకు దూప దీప నైవేద్యం కింద ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని మరింత సరళతరం చేయాలని సూచించారు. ప్రధానంగా అటవీ శాఖతో కలిసి టెంపుల్ టూరిజాన్ని, ఎకో టూరిజం తో కలిపి టూరిస్ట్ సర్క్యూట్స్ లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో నాగోబా, మేడారం లాంటి గిరిజన జాతరలకు సంబంధించి దేశ, విదేశీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చెప్పారు.

read also : పులకించిన భక్తజనం…మారుమోగిన రామ నామం..

రాష్ట్రంలో అటవీ సంపద, వన్య ప్రాణుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత నివ్వడంతోపాటు, ఏజెన్సీ, అటవీ భూముల్లో గిరిజనులకు ఆర్థిక పరమైన మేలు జరిగేలా ఆయుర్వేద సంబంధిత మెడిసినల్ ప్లాంటేషన్ లను చేపట్టాలని భట్టి తెలిపారు. రాష్ట్రంలో ఆయుష్ శాఖ, ఆయుర్వేద మందుల కంపెనీలతో ఈ మెడిసినల్ ప్లాంటేషన్ లకు సంబంధించి మార్కెటింగ్ కు అనుసందానం చేయాలని అన్నారు. అటవీ ప్రాంతాల్లో సఫారీ, ఎకో టూరిజంకు నగర వాసుల్లో మంచి ఆదరణ ఉందని ,ఈ విధమైన పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని భట్టి విక్రమార్క చెప్పారు. అటవీ ప్రాంతాల్లో వివిధ అవసరాలకు సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు.

Hospital

read also : అస్సాంలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర.. మోరిగావ్ జిల్లాలో పాదయాత్రపై ఆంక్షలు..

అనంతరం దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న దేవుడి మాన్యాల పరిరక్షణతో పాటు, అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని తెలియ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తెలంగాణకు చెందిన భక్తులు అత్యధికంగా సందర్శిస్తూ, గణనీయమైన ఆర్థిక వనరులు సమకూరుస్తున్నప్పటికీ, తెలంగాణా భక్తులకు కూడా తిరుమలలో ప్రాధాన్యత నిచ్చేలా చూడాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. వన్యప్రాణుల దాడుల్లో ఎవరైనా మరణిస్తే పరిహారాన్ని రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షకు తమ ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను తిరిగి పునరుద్దరించనున్నట్టు మంత్రి తెలిపారు.

read also : కోటి ఇండ్లకు సోలార్ ప్యానెల్స్ ..

దేవాదాయ, అటవీ శాఖలకు సంబంధించి ప్రతిపాదిక బడ్జెట్ నిధులను ఉదారంగా కేటాయించాలని మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ కమీషనర్ అనీల్ కుమార్, ప్రిన్సిపాల్ సీసీఎఫ్ దొబ్రియల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.