Read News in Telugu Language
adsdaksha

కదం తొక్కుదాం.. కాంగ్రెస్ తడాఖా దేశానికి చాటుదాం..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఏప్రిల్ 4

-కాంగ్రెస్ జన గర్జన
సభ వేదిక వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ ..

తుక్కుగూడ జన గర్జన సభ ఈ దేశానికి దిశా నిర్దేశం చేయనుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దేశంలోనే ఈ సభ చారిత్రాత్మకం కానుందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను తుక్కుగూడ సభనుంచే ఏఐసీసీ నాయకత్వం ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్ మాత్రమే అని, తెలంగాణ రాష్ట్రం మన అందరిదీ స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతికే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని భట్టి పేర్కొన్నారు. అవాస్తవాలు మాట్లాడే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదన్నారు.

పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు గత పాపాలకు బాధ్యత లేదంటే ఎలా అని భట్టి ప్రశ్నించారు. దేశ భద్రతకు వాడాల్సిన కమ్యూనికేషన్ వ్యవస్థను గత పాలకులు వ్యక్తిగత అవసరాలకు వినియోగించారని ఆరోపించారు. దేశ భద్రతకు ప్రమాదం తెచ్చారని, వ్యక్తిగత కుటుంబ జీవితాలు, వ్యాపారాలు, అధికారులు, జడ్జీలు ఏం మాట్లాడుకుంటున్నారో నిబంధనలకు విరుద్ధంగా తెలుసుకున్నారన్నారు. జరిగిన నష్టానికి పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటాం అని భట్టి తెలిపారు.

Read also: లీగల్ నోటీసులు పంపి కేటీఆర్‌ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి ..

తుక్కుగూడ జన గర్జన సభ ఏర్పాట్లను గురువారం భట్టి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, జూన్ మాసంలో వచ్చిన వర్షాలను కేసీఆర్ ఒడిసి పట్టలేదన్నారు. అవసరం లేకున్నా గొప్పల కోసం నాగార్జున సాగర్ నీటిని కిందికి వదిలారు, నిర్మాణ లోపంతో కాలేశ్వరం లో గోదావరి నీటిని కిందికి వదలవలసి వచ్చింది ..కెసిఆర్ తప్పిదాల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతోందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి, సంకల్పబలంతో ఇచ్చిన హామీలు అమలు చేస్తుందో తెలంగాణ మోడల్ గా తుక్కుగూడలో ఏఐసీసీ నాయకత్వం సందేశం ఇవ్వబోతోందని భట్టి తెలిపారు. ఇది గర్వకారణంగా భావిస్తున్నాం అన్నారు.

తుక్కుగూడ సభనుంచే ఎఐ సిసి అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ లు ఇచ్చిన 6 గ్యారంటీలను దేశమే ఆశ్చర్యపోయేలా అమలు గురించి తెలియజేస్తాం అన్నారు.

Read also: బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు… ఒక్క సీటు కూడా మీకు రానివ్వం..

హామీల అమలులో ఒక్కరోజు ఆలస్యమైన ఆలస్యమే అని భావించి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెచ్చాం, నిరుపేదల ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు.

Hospital

కెసిఆర్ మాదిరిగానే హామీలు అమలు చేయకుండా దిగిపోతారని అనుకున్నారు. ఎవరి ఊహకు అందని విధంగా అడగకముందే 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు భారతదేశం చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అమలు చేశామన్నారు.

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దశాబ్ద కాలం పాటు కాల్పనిక కథలు చెప్పింది. వీళ్లు కూడా అలాగే ఉంటారు అనుకోకుండా భద్రాచల సీతారామచంద్రస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో పూజ చేసి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు ప్రకటించాం అని గుర్తు చేశారు.

ఒక అడుగు ముందుకు వేసి ఊహలకు అందని విధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాలని నిర్ణయించాం. అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7 నుంచి మొదలు హైదరాబాద్ సభ వరకు డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణం మొత్తం లెక్కగట్టి చెక్కు రూపంలో అందజేశాం. అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజన వర్కర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నాం అని భట్టి తెలిపారు.

ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి కేవలం మూడు నెలల్లోనే 64.75 లక్షల మంది రైతులకు రైతుబంధు మొత్తాన్ని వారి ఖాతాల్లో నమోదు చేశాం. మీలాగా 8 నెలలు తీసుకోలేదని లెక్కలు చెబితే బీఆర్ఎస్ నేతలు నోరు మూసుకున్నారని ఎద్దేవా చేశారు.

రైతు బీమా కింద పదిహేను వందల కోట్ల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించిందని భట్టి గుర్తు చేశారు. ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు అందజేస్తున్నామన్నారు.

మూసీ నదిని పునర్జీవింపజేసి లండన్ లోని థేమ్స నదిని మరిపించే ప్రణాళికను సిద్ధం చేశాం అని భట్టి తెలిపారు.
ఫామ్ హౌస్ లో మూడు నెలలు పడుకొని బయటికి వచ్చి కరెంటు లేదంటూ మాట్లాడుతున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు పనికిరాని సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను బోగ్గు రవాణా ప్రాంతం నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. డిస్కమ్ లు, జెన్కోలు మీ పాలనలో కుప్పకూలిపోయాయని భట్టి విమర్శించారు.

కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థను సరిచేసి క్షణం కూడా కరెంటు పోకుండా చూస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందజేస్తున్నారు. 2030-31 వరకు పిక్ డిమాండ్ ను అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశాం అని తెలిపారు.

Read also: మున్సిపల్ శాఖపై కేటిఆర్ ఫైర్.. సిగ్గుండాలి అంటూ ఆగ్రహం..

30 వేల ఉద్యోగాలు మూడు నెలల్లో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం, అదనపు పోస్టులు కలిపి గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాదులో డ్రగ్స్ మాట వినిపిస్తే తాటతీస్తాం. హైదరాబాద్ లో ఉన్న బిడ్డలు నిశ్చింతగా ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు.

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వరంగల్ నుంచి మహబూబ్నగర్ వరకు తుక్కుగూడ సభకు కదలి రావాలని భట్టి పిలుపు నిచ్చారు. ప్రజాస్వామ్యం, హక్కుల పరిరక్షణ అంటే ఏమిటో ఈ దేశానికి జన గర్జన సభ ద్వారా చాటాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.