Read News in Telugu Language
adsdaksha

రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలన : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..

దక్ష న్యూస్, ఖమ్మం : ఏప్రిల్ 14

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా మార్గంలో మనందరం నడవడమే ఆయనకు మనం అర్పించే నిజమైన ఘన నివాళి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( mallu bhatti vikramarka ) అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం ఖమ్మం ( khammam ) కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భట్టి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ( congress ) ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన అందిస్తున్నదన్నారు. భారతరత్న అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టం అని భట్టి కొనియాడారు.

ప్రపంచ మేధావిగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల చట్టాలను అధ్యయనం చేసి దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన సామాజికవేత్త అంబేద్కర్ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా బలమైన పునాదులతో ఈ దేశం నిర్మించబడిందంటే అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగం ఫలితమే అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. అసమానతలు, తారతమ్యాలతో, సంక్లిష్టంగా, వ్యవస్థీకృతమైన ఈ దేశంలో ఎలాంటి రక్తపాతం లేకుండా రాజ్యాంగం అనే గ్రంథం ద్వారా అనేక మార్పులకు నాంది పలికిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు సమానమైన హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచిన తాత్వికవేత్త అంబేద్కర్ అని గుర్తు చేశారు. కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం కల్పించి కార్మిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి కార్మిక పక్షపాతిగా అంబేద్కర్ నిలిచారన్నారు.

read also : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : పోలీస్ కమిషనర్ సునీల్ దత్

సామాజిక, ఆర్థిక, లింగభేదం లేకుండా ప్రతి పౌరునికి సమానంగా ఓటు హక్కు కల్పించి కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటు అనే వరం అందించిన గొప్ప రాజనీతజ్ఞుడు అంబేద్కర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విప్లవాత్మకమైన ఆలోచనతో భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించి ప్రపంచంలోభారత దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా నిలబడటానికి కారణమయ్యారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు తూ.చా తప్పకుండా అమలు చేస్తున్నదన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చాలని కొన్ని పార్టీలు కుట్రలు కుయుక్తులు చేస్తున్నాయని విమర్శించారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగ ప్రేమికులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

భారత రాజ్యాంగం పరిరక్షనే ప్రజాస్వామ్య పరిరక్షణ అని భట్టి అన్నారు. భారత రాజ్యాంగం మార్చడం అంటే ప్రజాస్వామ్యం పై దాడి చేయడమే అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం కూలిపోతే పౌరులకు వాక్ స్వాతంత్రం, ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీల నాయకత్వంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ శ్రేణులు నడుం బిగించి ముందుకు కదలాలన్నారు.

read also : మెరిసి మురిసిన ఖమ్మం.. ఘనంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు..

Hospital

తెలంగాణలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితో వడి వడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నదని భట్టి తెలిపారు. అప్పులతో కూడిన రాష్ట్రాన్ని చిందరవందర చేసి చేతికిచ్చినప్పటికీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తయారు చేసే ఏజెన్సీ మహిళలకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులను చెల్లించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ సంవత్సరాల తరబడి వేతనం లేనటువంటి స్వీపర్లకు, ఆశ, అంగన్వాడి వర్కర్లకు ప్రతినెల వేతనాలు చెల్లిస్తున్నామని వెల్లడించారు.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో పెండింగ్ లో ఉన్న డైట్ బిల్లులను చెల్లించినట్టు భట్టి తెలిపారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన వడ్డీ లేని రుణాలను తిరిగి ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తున్నామని తెలిపారు.

డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిన్నటి వరకు మహిళలకు ఇచ్చిన రుణాలపై వడ్డీలను ఈ ప్రభుత్వమే చెల్లించిందని భట్టి తెలిపారు. లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఆర్థికంగా అందించి వారిని బలోపేతం చేయడం కోసం ప్రభుత్వమే వారికి ఇచ్చిన రుణాలపై వడ్డీలను చెల్లిస్తుందన్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమీకరించిందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నామని, అందులో భగంగా మహిళలకు 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర గ్యారెంటీలను అమలు చేస్తున్నాం అన్నారు.

సమాజంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికే విధంగా అంబేద్కర్ స్ఫూర్తితోనే గ్యారంటీలను అమలు చేస్తున్నామని భట్టి తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలన ప్రజలకే అంకితమన్నారు.

బిఆర్ఎస్ పై భట్టి ఫైర్..

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం భావ స్వేచ్ఛ లేకుండా పదేళ్లు పాలన చేసిన బిఆర్ఎస్ పాలకులు తగుదునమ్మా అని కాంగ్రెస్ ప్రజా పాలనపై ప్రగల్పాలు పలకడం శోచనీయమని భట్టి విమర్శించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి సెక్రటేరియట్ కు రాకుండా ప్రజలను కలవకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన గత బిఆర్ఎస్ పాలకులు ఇప్పుడు నీతి సూత్రాలు వల్ల వేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. విద్యుత్తు రంగాన్ని గందర గోళంలోకి నెట్టేసి, 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన గత పాలకులు ఇందిరమ్మ రాజ్యంలో నాణ్యమైన కరెంటును అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కరెంటు ఇవ్వట్లేదు అని విమర్శలు చేయడం సరికాదన్నారు.

లత్కోర్లు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగజారి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ మూడు నెలల ప్రజాపాలనపై, గత బిఆర్ఎస్ పరిపాలన చేసిన పదేళ్ల పాలనపై చర్చకు నేను సిద్ధం అని సవాలు విసిరారు.

 

Leave A Reply

Your email address will not be published.