Read News in Telugu Language
adsdaksha

వైద్య ఆరోగ్య శాఖలో ఔట్‌సోర్సింగ్‌ ఏజన్సీల చేతివాటం..

దక్ష న్యూస్, ఖమ్మం నవంబర్ 18

లక్షల్లో స్వాహా..

చదివిన చదువుకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో, రెగ్యులర్‌ ఉద్యోగాలు లేక అనేక సంవత్సరాలుగా ఎంతో మంది యువత నిరుద్యోగులుగా ఉండి పోతున్నారు. అందులో కొందరు కాంట్రాక్టు ఉద్యోగాల్లో జాయినయి అతి తక్కువ వేతనంతో బ్రతుకును కొనసాగిస్తుంటే, కొందరు గత కొన్ని సంవత్సరాల నుండి ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా ఉద్యోగాలు పొంది బ్రతుకులు వెళ్లదీస్తున్నారు. వీరిని ఉద్యోగులుగా ప్రభుత్వ విభాగాల్లో నియమిస్తూ, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు వీరికి జీతాలు చెల్లిస్తుంటాయి. అయితే ఏజెన్సీలు వారి జీతల్లో కోత విధిస్తూ కమిషన్లు తీసుకుంటాయి. అయితే వచ్చే కమీషన్‌ సరిపోక ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 30 మంది ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో సదరు ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ సుమారు 7 లక్షల రూపాయలు స్వాహా చేయడం సంచలనం సృష్టిస్తోంది. దాంతో ఏజెన్సీలు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ( outsourcing employees ) కడుపుకొడుతున్న ఉదంతం బయట పడి నివ్వెరపరుస్తోంది.

Read also: 33 మంది ఎంపీలు సస్పెండ్..

Hospital

వైద్య ఆరోగ్య శాఖలో గత మూడు సంవత్సరాల నుండి దాదాపు 30 మంది మహిళలు ఆరోగ్య కార్యకర్తలుగా, ఫార్మసిస్టులుగా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా పని చేస్తున్నారు. కాగా ఆ ఏజెన్సీ ఇచ్చే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో సైతం వారికి ఇచ్చే జీతంలో కూడా కోత కోస్తున్నట్లు తెలిసింది. కాగా జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం ఒక్కొక్కరికి సుమారు రూ. 27,699/- చెల్లిస్తుంది. సదరు ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ మాత్రం తమ ద్వారా ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం కేవలం రూ. 24 వేల నుండి 25 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో ఉద్యోగి నుండి దాదాపు రూ.3,600/- నుండి రూ. 3199/- రూపాయల వరకు తక్కువగా ఉద్యోగుల ఖాతాలో జమచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి మూడు శాతం కమీషన్‌ ప్రభుత్వం ఇస్తుండగా, ఇది సరిపోక ఉద్యోగుల జీతభత్యాలలోనూ కోతలు విధిస్తూ తక్కువ జీతం జమచేస్తున్నారు. ఈ విషయం పై గత కొన్ని నెలలుగా ఆ ఉద్యోగులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలిసి తమ గోడు వెల్లడించినప్పటికీ ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు.

కాగా ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ సంఘాల నాయకులు జిల్లా కలెక్టరును కలిసి గత ఆరు నెలలుగా జీతాలు రాని విషయంతోపాటు, జీతాలలో విధిస్తున్న కోతలను గురించి కూడా ఫిర్యాచేసినట్లు తెలిసింది.

కాగా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలను ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేసే సమయంలో కూడా ఆయా ఏజెన్సీలు ఉద్యోగులకు వారికి సంబంధించిన ఈపిఎఫ్‌, ట్యాక్స్‌లు సరిగ్గా చెల్లిస్తున్నాయో లేదో పరిశీలించాల్సిన జిల్లా ఔట్‌ సోర్సింగ్‌ కమిటీ కన్వీనర్‌ గా వ్యవహరించే జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి రెన్యువల్‌ చేయాలి. కానీ సదరు అధికారి పట్టించుకోకుండా కొన్ని సంవత్సరాలుగా వారినే కొనసాగిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు ఏడు లక్షల రూపాయలకు పైగా సదరు ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ తమ ఉద్యోగుల జీతాల్లో నుండి ‘స్వాహా। చేసినట్లు అధికారుల పరిశీలనలో బయటపడినప్పటికీ ఉదాసీనంగా జిల్లా అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఈ అవకతవకలపై జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, తమ వేతనాలలో కోత కోస్తూ తమను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్న ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.