Read News in Telugu Language
adsdaksha

సొంత పార్టీలకు జెలక్ ఇస్తున్నట్లు చేస్తున్న సరదా రాయుళ్లు ..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 4

కవర్ ల బరువు ఎక్కువ ఎటుంటే అటే.. అంటూ జనం సెటైర్ లు..

ఉదయం ఒక రంగు ..సాయంత్రానికి స్వంత రంగు ..

నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు అన్నట్లు ఉంది ప్రస్తుత రాజకీయ నాయకుల వైఖరి. రాజకీయాల్లోకి వచ్చేదే ప్రజా సేవ చేయడానికి అనేది ఒకప్పటి మాట. రాజకీయాల్లోకి వచ్చేది స్వలాభం కోసం అనేది నేటి మాటగా తయారయారయింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఏపార్టీ నాయకులు ఎప్పుడు ఎవరిగూటికి చేరుతారో అర్ధం కాని పరిస్థితి. నాయకుల వైఖరే కాదు కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు అలాగే తయారయ్యాయని విశ్లేషకులు పెదవిరుస్తున్నారు.

ఇటీవల ఎన్నికల కోడ్ వచ్చిన నాటినుండి తమ పార్టీ కేడర్ ని కాపాడుకోవడం పార్టీ అధినేతలకు తలనెప్పి వ్యవహారం గా తయారయిందనే చెప్పాలి. ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోయే సమయానికి ఏప్రాంతంలో నాయకుడు ఏపార్టీలోకి జంప్ అయి ఉంటాడో తెలియని పరిస్థితి. దాంతో వారిని రప్పించి బుజ్జగించి నయానో భయానో తిరిగి తమ పార్టీలోకి తీసుకురావాల్సిన పరిస్థితి. చోటామోటా నాయకులనుండి ప్రజాప్రతినిధుల వరకు ఇదే వరస.

Hospital

ఖమ్మం కార్పొరేషన్ లో కొందరు అధికార పార్టీ కార్పొరేటర్ లు కారు దిగి హస్తంతో దోస్తీ కట్టడం గత పది రోజుల క్రితం సంచలనంగా మారింది. ఉదయం వరకు మంత్రి తో ఉన్నవారు సాయంత్రం కల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వారి స్పూర్తితో మిగిలిన నాయకుల్లో లుకలుకలు మొదలైనా, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చాకచక్యంగా మంత్రాంగం నడిపి మిగతా కొందరు ఔత్సాహికుల్ని కండువాలు మార్చకుండా జాగ్రత్త పడగలిగారు.

ఎన్నికల సిత్రాలు..

తమ పార్టీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వరిస్తుందో లేదో అన్న అనుమానం, పాలకుల వైఫల్యాల నుండి వచ్చిన నిరుత్సాహం, తమను నిర్లక్ష్యం చేశారన్న అక్కసు లాంటి కారణాలతో గెలుపు అవకాశాలున్న పార్టీల్లోకి జంప్ అయ్యేవారు కొందరైతే.. కొందరు అభ్యర్థులు ముట్టజెప్పుతున్న ప్యాకేజీల కోసం జెండాలు మార్చుతున్నారన్న అపవాదులు హల్ చల్ చేస్తున్నాయి. కార్పొరేటర్ కయితే 25 నుండి 35 లక్షలు, మండలల్లో ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు వారి వారి సామర్ధ్యాన్ని, పనితనాన్ని బట్టి ప్యాకేజీల్లో మార్పులు ఉంటున్నాయని బోగట్టా. అయితే ఇంత వరకు ఒక ఎత్తయితే.. కేవలం ఎన్నికల సమయంలో అచ్చం అవతల నాయకులు ఇచ్చే ముడుపులకోసం మాత్రమే పార్టీలు మార్చుతున్నవారు కొందరని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇటీవల ఉదయం ఒక పార్టీలో జాయిన్ అయి సాయంత్రం సొంత పార్టీలోకి వెళ్ళిపోయి తమ నాయకుడితో కండువా కప్పించుకునే వారి సంఖ్య ఎక్కువయింది. ఇప్పటికే రాజకీయ నాయకులు తాము ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఓట్లకోసం హామీలు గుప్పిస్తున్నారన్న అసహనం, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందరికి చేరలేదన్న ఆగ్రహంతో ఉన్న ఓటర్లకు, కొందరి అవకాశవాద రాజకీయాలు విసుగు తెప్పిస్తున్నాయి. ఉదయం పార్టీ మారి సాయంత్రానికి స్వంత గూటికి చేరి రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చే వారిపట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఇలాంటి వారిపట్ల ఎన్నికల కమీషన్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.