Read News in Telugu Language
adsdaksha

అస్సాంలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర.. మోరిగావ్ జిల్లాలో పాదయాత్రపై ఆంక్షలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 22

రాహుల్ గాంధీ ఇటీవల ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాహుల్ గాంధీ అస్సాంలోని బోద్రోవా థాన్ మందిర్ లో పూజ చేయడానికి వెళ్లారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయన భగవాన్ శ్రీ రాముడిని స్మరిస్తూ పూజ చేయడానికి వెళుతుండగా.. ఆయనతోపాటు మిగతా కాంగ్రెస్ నాయకులను హైబొరా గ్రామంలో కొంత మంది దేవాలయ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు.

అస్సాంలోని హైబోరా గ్రామంలో సోమవారం శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్ర్ మందిర్ అనే దేవాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రవేశం లేదని అక్కడి సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో రాహుల్ గాంధీ గుడి బయటే నిరసన తెలియజేస్తూ రోడ్డుపై బైఠాయించారు.

Read also: కోటి ఇండ్లకు సోలార్ ప్యానెల్స్ ..

అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాతే ఆలయం లోపలికి పంపిస్తామని పోలీసులు స్పష్టం చేయడంతో రాహుల్ గాంధీ, మిగతా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దేవాలయం ఎదుటే రోడ్డుపై ధర్నా చేశారు. రోడ్డుపై రాహుల్ గాంధీతో పాటు మహిళలు కూడా కూర్చొని ధర్నా చేశారు. అందరూ కలిసి రఘుపతి రాఘవ రాజా రామ్ అంటూ భజనలు చేశారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… నేను ఎందుకు లోపలికి వెళ్లకూడదు? నేనేం నేరం చేశాను? నన్ను ఎందుకు అడ్డుకుంటున్నాని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తాము ఎటువంటి సమస్యలను సృష్టించాలని అనుకోవడం లేదని, కేవలం పూజలు చేసి వెళ్తామని అన్నారు. ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీనే నిర్ణయిస్తారా ఏమిటని నిలదీశారు. నియంతృత్వ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hospital

Read also: 29న రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్ లాంచ్ ..ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే..

దేవాలయ కమిటీ అధ్యక్షుడు యోగేంద్ర నారాయణ్ దేవ్ ఈ ఘటనపై స్పందించారు. రాహుల్ గాంధీ ఈ గుడికి వస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నారు. అయోధ్యలో వేడుకల సందర్భంగా ఈ దేవాలయంలో కూడా వేడుకలు చేస్తున్నామని, అందుకే మధ్యాహ్నం 3 గంటల తరువాత రాహుల్ గాంధీ పూజలు చేసుకోవచ్చని చెప్పామన్నారు.

మోరిగావ్ జిల్లాలో పాదయాత్రను, స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని నిలిపేయాలని జిల్లా యంత్రాంగం రాహుల్ కు సూచిస్తూ, కార్యక్రమాలకు అనుమతి నిరాకరించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు దుండగులు ప్రయత్నించే అవకాశం ఉన్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఒకే రోజు జరుగుతోన్న రెండు ప్రధాన కార్యక్రమాల (అయోధ్య ప్రాణప్రతిష్ఠ, జోడోయాత్ర)ను అదునుగా తీసుకుని దుండగులు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాల సమాచారమని, జిల్లాలో శాంతిభద్రతలను కాపాడే బాధ్యతతో పాటు రాహుల్ గాంధీ సెక్యూరిటీ దృష్ట్యా.. బిహుతోలిలో ప్రతిపాదిత స్ట్రీట్- కార్నర్ సమావేశాన్ని నిర్వహించొద్దని, మోరిగావ్ పట్టణంలో శ్రీమంత శంకరదేవ చౌక్ నుంచి పోలీసు పాయింట్ వరకు పాదయాత్రను నిలిపేయాలని అభ్యర్థిస్తున్నామని, రోడ్డులో వాహనాలను ఎక్కడా ఆపొద్దని జిల్లా ఉన్నతాధికారులు కాంగ్రెస్ పార్టీకి రాసిన లేఖలో స్పష్టంచేశారు.

ఈ ఘటనలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుండటంతో మోడీ తట్టుకోలేక కుట్రలు చేస్తున్నాడని అన్నారు. మోడీ చెప్పినట్టు అధికారులు రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకుంటున్నారని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ యాత్ర కొనసాగుతుందని అన్నారు. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు వెళ్తారని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.