Read News in Telugu Language
adsdaksha

గుర్తుకొస్తున్నాయి.. నా తండ్రికి, అమేథీకి ఉన్న ప్రేమకు నేనే సాక్షిని : చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రాహుల్ గాంధీ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మే 17

42 ఏళ్ల క్రితం తన తండ్రి రాజీవ్ గాంధీతో కలిసి తొలిసారి అమేథీకి వచ్చానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( rahul gandhi ) చెప్పారు. అమేథీ నుంచే రాజకీయాలు నేర్చుకున్నానని, అమేథీ ప్రజలే తనకు అన్నీ నేర్పారని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ తో పాటు, ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుండి కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం అమేథీలో కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థి కేఎల్ శర్మ తరుపున రాహుల్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అమేథీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తన చిన్ననాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

తన తండ్రి రాజీవ్ గాంధీకి, అమేథీ ప్రజలకు ఉన్న ప్రేమానుబంధానికి తానే సాక్షినని రాహుల్ చెప్పారు. తాను రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ… అమేథీతో తన బంధం చెక్కు చెదరదని రాహుల్ తెలిపారు. ఎప్పటికీ అమేథీ ప్రజల వెన్నంటే ఉంటానన్నారు. తొలిసారి తాను అమేథీకి వచ్చినప్పుడు రోడ్లు కానీ, అభివృద్ధి కానీ లేవని గుర్తు చేసుకున్నారు. ఈ లోక్ సభ ఎన్నికలు దేశానికి అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించారు.

Hospital

read alsso : రాష్ట్ర మంత్రులను కలిసిన తీన్మార్ మల్లన్న .. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని కార్యకర్తలకు మంత్రుల పిలుపు..

బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికైనా ఉందా అని రాహుల్ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఉందన్నారు. ప్రస్తుత రాజ్యాంగానికి ముగింపు పలకాలని మోదీ కోరుకుంటున్నారని… రాజ్యాంగం కనుమరుగైతే ప్రభుత్వ రంగమే ఉండదన్నారు. రిజర్వేషన్లకు స్వస్తి పలుకుతారని, ద్రవ్యోల్బణం తార స్థాయికి చేరుకుంటుందన్నారు. ప్రజల హక్కులను ఒక్కొక్కటిగా లాక్కుంటారని విమర్శించారు.

22 నుంచి 25 మంది శ్రీమంతుల కోసం రైతులు, కార్మికుల హక్కులను కాలరాస్తారని విమర్శించారు. ఇప్పటి వరకు రైతులకు, ప్రజలకు మేలు జరిగినా… హరిత విప్లవాన్ని తీసుకొచ్చినా అది రాజ్యాంగంతోనే సాధ్యమయిందన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే.. భారతీయ జనతా పార్టీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని ఈ సందర్భంగా రాహుల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీతో పాటు అఖిలేష్ యాద్, పలువురు ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.