Read News in Telugu Language
adsdaksha

నా రోల్ మోడల్ శాం పిట్రోడా : డిప్యూటీ సీఎం భట్టి..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 8

రీ డిజైన్ ద వరల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా( sam pitroda ) తనకు రోల్ మోడల్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( bhatti vikramarka ) అన్నారు. హోటల్ తాజ్ కృష్ణ ( hotel taj krishna ) లో ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా రచించిన రీ డిజైన్ ద వరల్డ్ (redesign the world ) తెలుగు అనువాదం ‘ ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి ’ అనే పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి ఎం.ఎం పల్లంరాజు, మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తో కలిసి భట్టి ఆవిష్కరించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా రచించిన ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి అనే పుస్తకం దేశంతో పాటు సమాజాన్ని మార్చి వేస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని తెలిపారు.

ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని డిప్యూటీ సీఎం భట్టి అభిప్రాయపడ్డారు. అసమానతలు పెరగడం సమాజానికి హానికరమని రచయిత ఈ పుస్తకంలో చాలా విశ్లేషణాత్మకంగా పొందుపరిచారని వివరించారు. సమాజ హితం కోసం వారు చేస్తున్న రచనలు చాలా స్ఫూర్తిదాయకం చైతన్యవంతమైనవన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ప్రజల ఆశలు ఆకాంక్షలు కలలు నెరవేరలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న కలలు ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల కలలు ఆశలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి సాంకేతికంగా, మేధో పరంగా మద్దతు సహకారం అందించడానికి తెలంగాణకు రావలసిందిగా శామ్ పిట్రోడాకు భట్టి విజ్ఞప్తి చేశారు.

read also : సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి ..

మనందరి ప్రియతమ నాయకులు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఈ దేశంలో టెలి కమ్యూనికేషన్ రంగాన్ని తీసుకువచ్చేందుకు అమెరికాలో ఉన్న శ్యామ్ పిట్రోడా మేధస్సును గుర్తించి అడ్వైజర్ గా సేవలు తీసుకున్నారని భట్టి విక్రమార్క అన్నారు. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని చాలా దగ్గరగా తీసుకురావడానికి టెలి కమ్యూనికేషన్ ద్వారా భారీ విప్లవాన్ని శ్యామ్ పిట్రోడా తీసుకొచ్చారని తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థిగా చదువుతున్న సమయంలో తన ఇంటికి ఫోన్ చేయడానికి జనరల్ పోస్ట్ ఆఫీస్ లో ట్రంక్ కాల్ బుక్ చేసి గంటల తరబడి నిరీక్షించి ఫోన్ చేసి మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు. ఫోన్ చేయడానికి గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి నుంచి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎవరితోనైనా క్షణాల్లో ఫోన్ చేసుకుని మాట్లాడే సౌకర్యం ఇప్పుడు వచ్చిందంటే శామ్ పిట్రోడా చేసిన కృషి అని చెప్పక తప్పదన్నారు.

Hospital

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల కమిటీలకు తాను ఇన్చార్జిగా కొనసాగిన సమయంలో అమెరికాలోని 20 నగరాల్లో ఎన్ఆర్ఐ సెల్ కమిటీలు వేశానని చెప్పారు. ఈ క్రమంలో చికాగో నగరంలో కూడా ఎన్నారై సెల్ కమిటీ వేయడానికి వెళ్ళిన కార్యక్రమానికి శ్యామ్ పిట్రోడా హాజరు అయ్యారని ఆయనతో ఉన్న అనుబంధాన్ని సందర్భంగా గుర్తు
చేస్తున్నారు.

read also : ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం సమీక్ష సమావేశం..

పుస్తకావిష్కరణ సందర్భంగా క్వాడ్ జెన్ వైర్ లెస్ సొల్యుషన్స్ చైర్మన్ సీఎస్ రావు మాట్లాడుతూ, ‘రీడిజైన్ ది వరల్డ్’ పుస్తకం ప్రపంచ క్రమం ఎలా, ఎందుకు మారాలి, హైపర్ కనెక్టివిటీ ప్రపంచాన్ని ఎలా మార్చగలదో సూచిస్తుందన్నారు. ఈ తెలుగు అనువాదాన్ని పి.ఎన్.రావు తన అద్భుతమైన కృషితో, హైదరాబాదుకు చెందిన ఎమెస్కో ప్రచురణ సంస్థ సహకారంతో చేశారన్నారు. ఇది ప్రజాదరణ పొందిన పుస్తకంగా మారుతుందని ఆశిస్తున్నాను. ప్రపంచ నిర్మాణం గురించి, భారతదేశ ఎదుగుదలపై దాని ప్రభావం గురించి రాసిన ఈ తెలుగు అనువాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలంతా చదవాల్సిన అవసరం ఉందన్నారు.

తనకు తెలుగు అనువాద హక్కులు ఇచ్చినందుకు శామ్ పిట్రోడాకు సి.ఎస్.రావు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయ్ కుమార్ నేతృత్వంలోని ఎమెస్కో అనే అత్యంత ప్రజాదరణ పొందిన, చరిత్రాత్మకంగా స్థాపించిన తెలుగు ప్రచురణ సంస్థకు కూడా తన కృతజ్ఞతలు తెలియజేశారు.

శాం పిట్రోడా రాసిన ఈ పుస్తకాన్ని పోలదాసు నరసింహారావు తెలుగులోకి అనువదించగా, డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి సంపాదకుడిగా వ్యవహరించారు.
శాం పిట్రోడా ఈ కార్యక్రమంలో జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పరకాల ప్రభాకర్, మాజీ ఎం.పి. వుండవల్లి అరుణ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు, ఐపీఎస్ వి.వి. లక్ష్మీనారాయణ, ఐపీఎస్ ఎన్. సాంబశివ రావు, ఐఏఎస్ కె.ఎన్.కుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.