Read News in Telugu Language
adsdaksha

దళితబంధు పెట్టమని మమ్మల్ని ఎవ్వరూ అడగలే.. దళిత సమస్యలు దేశానికే మాయని మచ్చ..

దక్ష న్యూస్, సత్తుపల్లి: నవంబర్ 1

రాజకీయం అంటే గడియారాలు, పైసలు, మందుబాటిళ్లు పంచుడు కాదు..

వెంకటవీరయ్యను అఖండ మెజార్టీతో గెలిపించి సత్తుపల్లి సత్తా చాటాలె..

సత్తుపల్లి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్ ..

సత్తుపల్లి చాలా చైతన్యమున్నప్రాంతం అని బిఆర్ఎస్ ( brs ) అధినేత సీఎం కేసిఆర్ ( cm kcr ) అన్నారు. ఎన్నికలు వస్తుంటయ్..పోతుంటయ్.. ఎవరో ఒకరు గెలువడం మామూలే. మా కులపోడని, ఇంకెవరో అని ఓట్లను వేయొద్దు. తమ స్వంత విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని కేసిఆర్ ప్రజలకు సూచించారు. బుధవారం ఖమ్మం ( khammam ) జిల్లా సత్తుపల్లి ( sattupalli ) నియోజకవర్గం కల్లూరు ( kalluru ) లో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ( sandra venkata veeraiah ) ఆధ్వర్యంలో  నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు కేసిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళిత బంధు లాంటి పథకాన్ని ఈ దేశంలో పెట్టిన మొగోడు ఎవరు అని ప్రశ్నించారు. దళిత బంధు పెట్టుమని నన్నెవరూ అడగలేదన్నారు. దానికోసం ఎవరూ ధర్నాలు చేయలేదు..దరఖాస్తులు ఇవ్వలేదు. ఎందుకు పెట్టామో ఆలోచించాలె.. ? దళిత సమస్యలు దేశానికే మాయని మచ్చ. యావత్ భారత దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. 75 ఏండ్ల క్రితం స్వతంత్రం వచ్చిననాడే దళితుల పరిస్థితి బాగాలేదు. యుగయుగాలుగా, తరతరాలుగా దళితులు అణిచివేతకు, వివక్షకు గురయ్యారు. వెలివాడల్లో ఉన్నారు. జాషువా లాంటి మహాకవి బాధపడి కావ్యాలు రాసాడు. దళిత జాతి ఎందుకావిధంగా ఉండాలె? వాళ్లు సాటి మనుషులు కాదా? మనలాగా పుట్టలేదా? ఈనాడు పెడబొబ్బలు పెట్టే మూడు రంగుల జెండాలు, ఎర్ర జెండాలు, రంగురంగుల జెండాలు ఏం జేసిండ్రు? ఒక్కసారి గుండెమీద చెయ్యివేసి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నరు తప్ప ఏ జెండాలు ఏం చేయలేదని కేసిఆర్ విమర్శించారు. దళితులకు అరచేతిలో బెల్లం పెడుతా.. మోచేతితో నాకిస్తా.. నీకు చక్కెరగోలీలు ఇస్తా అని ఎన్నికల ముందు మోసం చేసి దశాబ్ధాల తరబడి వారిని ఓటు బ్యాంకుగా వాడుకున్నరని ధ్వజమెత్తారు. దళితుల నిజమైన శ్రేయస్సు గురించి ఎవరూ ఆలోచించలేదని, వారిని మనుషులుగా గుర్తించలేదన్నారు. ఇవ్వాల ఉత్తర భారత దేశంలో దళితుల మీద దాడులు జరగని రోజు లేదు.
ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ఘోరంగా దాడులు జరుగుతావున్నయ్. మహిళల మీద మానభంగాలు జరుగుతావున్నయ్? ఏందీ వివక్ష? ఏందీ దురాగతం? .. అహంకారమా? నేను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కార్యకర్తలతోని ఆనాడే దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని పెట్టి, కార్యక్రమాలను చేసాం.
దళిత బంధుకు ఆనాటి సిద్ధిపేటలోని దళిత చైతన్య జ్యోతి కార్యక్రమమే స్ఫూర్తి అని తెలిపారు.

read also : రైతుల బాధలు నాకు తెలుసు నేనూ కాపోన్నే… ఎన్నికల్లో ప్రజలే గెలవాలె..

Hospital

రెండోసారి అధికారంలోకి వచ్చాక, రాష్ట్ర ఆదాయం మెరుగయ్యాక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని పథకాలనే ఎక్కువగా చేపట్టాం అని కేసిఆర్ తెలిపారు. ఓట్ల కోసమని, ఎన్నికల్లో గెలవాలని ఆదరాబాదరగా ఏ పనీ చేయలేదు.
మేం తెలంగాణ తెచ్చినవాళ్లుగా బాధ్యతతో పనిచేస్తున్నం. చిల్లర రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాం అన్నారు. పెన్షన్లను మొదట వెయ్యి రూపాయలతో ప్రారంభించి, తర్వాత రెండు వేలకు పెంచామని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి మొదట యాభై వేలతో ప్రారంభించి, తర్వాత 75 వేలకు పెంచినం. తర్వాత లక్షా పదహారులకు చేసుకున్నం అని వివరించారు.

నోట్ల రద్దు, కరోనా లు లేకుంటే దళిత బంధు ఒక సంవత్సరం ముందే ప్రారంభమయ్యేదని కేసిఆర్ తెలిపారు. దళిత బంధును హుజురాబాద్, చింతకాని, చారగొండ, నిజాంసాగర్, తిర్మలగిరి మండలాల్లో పూర్తిగా వంద శాతం అమలు చేశామన్నారు. దళిత బంధు అమలులో సంకుచిత మనస్తత్వంతో ఆలోచించలేదు. ప్రతిపక్ష నాయకుడైన భట్టి నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని పెట్టాం.
మేం స్వార్థ రాజకీయ నాయకులమైతే మా దగ్గరే పెట్టుకునేవాళ్లం. అది మా నిజాయితీకి గీటురాయి. కేసీఆర్ ఎన్నికల కోసం దళిత బంధును పెట్టలేదు. ఎన్నికల కోసమని ఈసీ దగ్గర పిర్యాదు చేసి ఆపినోడే వస్తలేదంటున్నడు.
మిషన్ భగీరథ ఎన్నికల కోసం పెట్టామా? సీతారామ ప్రాజెక్ట్ కట్టమని నాకెవ్వరైనా చెప్పారా? జిల్లాలో ఉన్న నాయకులకెవరి కలలోనైనా ఈ ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు.

మీరు తలుచుకుంటే సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి పహిల్వాన్ లాగా నాలుగోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడా..? నామా నాగేశ్వర రావు ఖమ్మం ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టడా..? ఖమ్మం జిల్లాలో డబ్బు, అహంకార రాజకీయాలు ఇంకెన్ని రోజులు జరుగుతయ్? జిల్లా మొత్తం ఆలోచించాలన్నారు. ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య పోరాటం కాదు..పార్టీల మధ్య పోరాటం. ఏ పార్టీ ఏం చేసిందో ప్రజల ముందు ఉన్నది.
స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉండి ఏం చేసిందో.. ఈ పదేండ్లలో మనమేం చేసినమో మీ కండ్ల ముందటే ఉన్నది. హృదయంతో ఏది మంచో, ఏది చెడో ఆలోచన చెయ్యాలె అన్నారు.

రాజకీయం అంటే గడియారాలు, పైసలు, మందుబాటిళ్లు పంచుడు కాదు.
అరువై, డెబ్బై రూపాయల గడియారం కోసం మన బతుకుల్ని అమ్మాల్నా? ఆలోచించండని కేసిఆర్ అన్నారు. గడియారం బొమ్మ కావాల్నా? లేక కడుపు నిండ అన్నం, ఆత్మగౌరవం కావాల్నా?.. ఇదీ ఆలోచించండి అన్నారు. ఎవరు ఫోన్ చేసినా పక్షిలాగా వాలిపోయేటోడు సత్తుపల్లి సండ్ర వెంకటవీరయ్య. ఆపద్బంధు అంబులెన్స్ ఆలస్యమైతది కాని సండ్ర వెంకటవీరయ్య మాత్రం ఆలస్యం కాడని మిత్రులంటరు. అంతగా ప్రజల్లో ఉండే మనిషి. ప్రజా కార్యకర్తగా ఎదిగి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి మన సండ్ర వెంకట వీరయ్య. డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ..సింగల్ రోడ్డు వచ్చిందంటే ఆంధ్రా. మేం పోతే మీకు బతుకొస్తదా.. మీకు పరిపాలన చేయొస్తదా.. అని నాటి పాలకులు అన్నరు. అలాంటోళ్లే వచ్చి మన దగ్గర ధాన్యం అమ్ముకుంటున్నరు అని ఎద్దేవా చేశారు.

read also : సీఎం సభాస్థలిలో మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు..

బీఆర్ఎస్ కు, సండ్ర వెంకట వీరయ్యకు ఓటేస్తే ధరణి ఉంటుందని కేసిఆర్ అన్నారు. మీ భూమి మీకే ఉంటది.
రైతు బంధు డబ్బును కేసీఆర్ దుబారా చేస్తుండని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు.
కాంగ్రెస్ కు ఓటేస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీం..రెవెన్యూ రికార్డులు, వకీళ్లు, కోర్టుల చుట్టూ మళ్లీ తిరుగాలె. పైరవీకారులు, దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ ను తెచ్చుకొని మళ్లీ ప్రమాదం తెచ్చుకుందామా?..మీరు ఆలోచించాలె. మీ గ్రామాల్లో చర్చ చేయాలె అన్నారు.

ఈ ప్రాంతంలోనే పుట్టిన పార్థసారధి రెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేసాడు.
సీతారామ ప్రాజెక్ట్ నా గుండెకాయ లాంటి ప్రాజెక్ట్. ఏడాదిలో పూర్తవుతుంది.
సీతారామ ప్రాజెక్ట్ పాత ఖమ్మం జిల్లా వరప్రదాయని కాబోతున్నది. ఖమ్మం జిల్లా బంగారు తున్క అవుతుంది. నా రైతులు మూడు పంటలు పండించి దర్జాగా కాలుమీద కాలేసుకుని కూర్చునేరోజు వస్తది. ఎన్నికల తర్వాత వెంటనే ఇక్కడ దళితబంధు వందశాతం అమలైతది. మిమ్మల్ని జాగృతం చేసి, వికాసం చేస్తున్న కేసీఆర్ లాంటి నాయకున్ని పోగొట్టుకోవద్దు. వెంకటవీరయ్యను అఖండ మెజార్టీతో గెలిపించి సత్తుపల్లి సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.