Read News in Telugu Language
adsdaksha

ఉడిపికి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు..?

దక్ష న్యూస్, ఆధ్యాత్మికం..

స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం తెలుసా..

శ్రీ కృష్ణుని ఆలయాల ( srikrishna mandir ) లో, నాలుగు ఆలయాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ లోని మథుర ( madhura ), గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక ( dwaraka), దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు ( guruvayar ), కర్ణాటకలోని ఉడుపి ( udipi ). ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడుపితో ముడిపడి ఉంది. ఒక రోజు శ్రీ మధ్వాచార్యుల వారు, వేకువజామునే, సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాత: సంధ్యాదికాలు ముగించుకుని, ఆ తీరంలోనే కూర్చుని, ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు పర్వదినం కావడంతో, అనేక మంది ప్రజలు కూడా వచ్చి, సముద్రస్నానం చేశారు.
ప్రశాంతమైన ప్రాత: కాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం. అలాంటి నేపద్యంలో, శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా, ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు.

ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో, ద్వారక నుండి సరుకులు తీసుకువస్తోన్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా, అకస్మాత్తుగా, విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి. ఈ గాలులకు సముద్ర కెరటాలు, ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవడానికి, అందులోని నావికులు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది. ఏ క్షణాన్నైనా, నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో, చివరి ప్రయత్నంగా, నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ, రక్షించేవారి కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అంత దూరం నుంచి కూడా, ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయననుద్దేశించి, మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు.

ద్వాదశ స్తోత్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ, అంతటి హోరుగాలిలోనూ అంత దూరంనుంచి వ్యాపారి చేస్తోన్న ప్రార్థన, మధ్వాచార్యుల చెవిని తాకింది. అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం, ఒక కొసను పట్టుకుని గాలిలో నావ కేసి విసిరి, వెనక్కు తీసుకున్నారు. అంతే, ఆ క్షణం వరకూ సముద్రంలో మునిగిపోతుందా? అన్నట్లున్న నౌక, ఒక్కసారిగా స్థబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా, తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి, వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి, సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం లేచి నిలబడి, అంజలి ఘటించి, ‘స్వామీ, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి’. అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు.

మధ్యాచార్యుల వారు చిరునవ్వు నవ్వి, చివరకి అతని కోరికను మన్నించారు. అయితే, ‘నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు, నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు ఇవ్వగలవా’ అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, గోపీచందనం, ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి. పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడూ, దించేటప్పుడూ, బరువు సమతూకం తప్పిపోకుండా, గోపీ చందనపు గడ్డల సహాయంతో, నౌకలో సరుకును అటూ ఇటూ సర్దుతూ ఉంటారు. అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు, ఈ మహానుభావుడు కోరడం, ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు. ఎంత ప్రార్థించినప్పటికీ, మధ్వాచార్యుల వారు, తాను కోరిన గోపీ చందనానికి మించి, మరే బహుమతినీ తీసుకోవడానికి అంగీకరించలేదు. చివరికి ఆ వ్యాపారి, స్వామి కోరిన ఆ గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి, అవే కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ, విశేషాలేమిటో, కనీసం అవైనా తెలుపమని, ప్రార్థించాడు.

Hospital

స్వామి మళ్లీ చిరునవ్వు చిందిస్తూ, ‘నువ్వే చూడు’ అంటూ, ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే, నీటితో కరిగించారు. ఆ సమయంలో, అక్కడ ఓ అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం, రెండవ దాని నుండి శ్రీ కృష్ణుని విగ్రహం బయటపడ్డాయి. అక్కడున్నవారందరూ, సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. శ్రీ కృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే, మధ్వాచార్యులు, ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో, దశావతారాన్ని వర్ణించారు. బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, శ్రీ కృష్ణుని విగ్రహం తీసుకుని, ఉడుపికి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత, ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే, ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృతరూపమైనటువంటి శ్రీ కృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.

ఇంతకీ శ్రీ కృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి? వాస్తవానికి జరిగిందేంటి? అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది.
ఆ శ్రీకృష్ణుని విగ్రహం, సామాన్యమైనదికాదు. ఒకసారి దేవకీదేవి, ‘కృష్ణా.. నీ బాల్య లీలలు చూసే భాగ్యం, యశోదకు కలిగినట్లు నాకు కలుగలేదు. వాటి గురించి వినీ, వినీ, ఎప్పటికైనా చూడాలని, నా మనస్సు ఉవ్విళూరుతోంది. చూపించవా కృష్ణా’ అని ప్రార్థించింది. కృష్ణుడు అనుగ్రహించాడు. మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు. తప్పటగులు వేస్తూ నడిచాడు. దేవకీ దేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని త్రాగాడు. కేరింతలు కొట్టాడు. కుండ పగులగొట్టి వెన్న తిన్నాడు. ఒంటినిండా రాసుకున్నాడు. పామును తాడులాగా పట్టుకుని, మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా, తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు. ఈ చేష్టలను చూసి దేవకీ దేవి పరవశించి, మైమరచిపోగా, ఇదంతా గమనిస్తున్న రుక్మిణీ, తన పతి దేవుని శైశవ రూపాన్ని, ప్రపంచమంతా చూసి తరించాలని భావించి, వెంటనే విశ్వకర్మను పిలిపించి, ఆయా రూపాల్లో, శైశవ కృష్ణుడూ, బలరాముని విగ్రహాలను చేయించింది.

ముందుగా తానే, సకల వైభవాలతో, విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది. మరికొంత కాలానికి, ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం, ఆసన్నమైంది. దూరదృష్టితో అర్జునుడు, ఆ విగ్రహాలను తీసుకువెళ్లి, ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి, దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో, ఆ వనం యావత్తూ, గోపీ చందనం మట్టిలో కలిసి, కనుమరుగైపోయింది. నావికులు తమ నౌకల్లో, సమతూకాన్ని పాటించడం కోసం, గోపీ చందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం, కాకతాళీయంగా, ఈ విగ్రహాలున్న గోపీ చందనం గడ్డల్ని కూడా, నౌకలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే, వాటిని తీసుకెళ్లే భాగ్యం, ఆ వ్యాపారికి లభించింది.

అయితే ఆ విగ్రహం, ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యులవారి దివ్య దృష్టికి ముందే తెలుసు. ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ, ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే, ఆయన ఆరోజు, ఆ తీరానికి వెళ్లారు. శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు, తమ శిష్యుల చేత, మాధవ సరోవరంలో, ప్రక్షాళన చేయించారు. తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు, నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం, మధ్వాచార్యుల వారు అభిషేకించిన తరువాత, 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు. ఎందుకంటే, మధ్వాచార్యుల అభిషేకంతో, ఆ విగ్రహంలో, శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడింది.
మంత్ర విధులతో, మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోకంగా, శ్రీ కృష్ణ విగ్రహాన్ని, విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ నాడు, సామాన్య శకం, 1236 వ సంవత్సరంలో, ఉడుపిలో ప్రతిష్ఠింపజేశారు. ఆనాటి నుంచి, ఉడుపి ప్రాంత యాజ్ఞికులందరూ, శ్రీ మధ్వాచార్యులవారు అవలంభించిన విధానాలనే, అనుసరిస్తున్నారు. శ్రీ కృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా, తన 8 మంది శిష్యులచే నిర్వహింపబడేటట్లుగా, పెజావరు మఠం, పుట్టిగే, పాలిమరు, ఆడమారు, సోదే, కాణియూరు, శిరూరు, కృష్ణ పురా అనే ఎనిమిది మఠాలను, శ్రీ మధ్వాచార్యులు ఏర్పరచారు. వీటిని అష్టపీఠాలు అంటారు. ఇవన్నీ, ఉడుపి కేంద్రంగా, శ్రీ కృష్ణ మఠానికి చుట్టు ప్రక్కల ఉన్నాయి.

సేకరణ : పొదిల చూడామణి. హైదరాబాద్

Leave A Reply

Your email address will not be published.