Read News in Telugu Language
adsdaksha

ఓటు హక్కు ప్రజల చేతిలో ఆయుధం లాంటిది : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 25

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశంలో ఓటు హక్కు ప్రజల చేతుల్లో ఆయుధంలాంటిదని, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ( tamilisai soundararajan ) అన్నారు.
ముఖ్యంగా కొత్తగా ఓటుహక్కు పొందిన యువత ఓటు వేయడాన్ని గర్వంగా ఫీల్ అవ్వాలని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియం లో జరిగిన 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ కు అదనపు సిఈఓ లోకేష్ కుమార్, జీహెచ్ ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోస్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ లతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందని, ఓటు వేసి మంచి భవిష్యత్తును నిర్ణయించడం అనేది మన చేతుల్లో ఉందన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును మొదటిసారి వినియోంచుకున్న యువత ఎంతో ఆనందంగా ఓటు వేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఎంతో విజయవంతం అయ్యాయని… రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో ఆనందకరమన్నారు.

Read also: ఆదివాసీలు సంఘవిద్రోహ శక్తులకు సహకరించవద్దు.. నూతన వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వండి..

Hospital

80 ఏండ్లు పైబడిన వృద్ధులు, వికలాంగుల కోసం మొదటిసారి హోం ఓటింగ్ నిర్వహించారని, ఈ ఎన్నికలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచాయని గవర్నర్ అన్నారు. యువత ఓటింగ్ రోజును సెలవు దినంగా కాకుండా, తమ భవిష్యత్తును నిర్ణయించే రోజుగా భావించి తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్లోని ఐటీ కంపెనీలకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఓటు హక్కు ఉన్న వారిని వినియోగించుకునేలా సెలవులు ఇచ్చేలా సౌకర్యాలు కల్పించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు ప్రాధాన్యతను ఆమె వివరించారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో ఉండటం గర్వించదగిన విషయమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించే సిబ్బంధికి తగిన వసతులు కల్పించాలని అధికారులను కోరారు. మంచివారిని ఎన్నుకుంటే సుపరిపాలన అందించగలరని తెలుపుతూ భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని… దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఓటు మన బాధ్యత అని, ఓటు వేయకపోతే మన చరిత్రను మరచి, భవిష్యత్తును పాడుచేసుకున్న వారవుతారని, యువత బాధ్యతనెరిగి మంచి అభ్యర్థిని గుర్తించి ఓటు వేయాలన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి మాట్లాడుతూ… ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల అధికారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా అబ్రహాంలింకన్ అన్న “బుల్లెట్ కన్నా బలమైనది బ్యాలట్” మాటను ఆయన గుర్తు చేశారు. యువత ఓటు హక్కును తప్పకుండా వినియోగించు కోవాల్సిందిగా పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువత ఓటు వేయాలని తెలిపారు. ప్రస్తుతం ఓటు శాతం గ్రామీణ ప్రాంతాల్లో పెరగగా… హైదరాబాద్ వంటి పట్టణాల్లో తగ్గిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు మరింత కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ముఖ్యంగా యువత ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Read also: పెద్దల సభలో రవిచంద్రది క్రియాశీలక పాత్ర : నామా నాగేశ్వరరావు..

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ…. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా కొత్తగా ఓటర్ల నమోదుకు సంబంధించి 2023 సంవత్సరంలో 18 సంవత్సరాలు నిండిన వారు 9.99,667 మంది ఓటర్లుగా నమోదైనట్లు వివరించారు. ఈ సంవత్సరంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియలో ఇప్పటి వరకు 7,50,000 మంది ఉన్నారని, ఫిబ్రవరి 8వ తేదీన ప్రచురించే తుది జాబితాలో మరింత పెరుగుతుందన్నారు. అలాగే ఆన్లైన్లో, బీఎల్వోల ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని వికాస్ రాజ్ కోరారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా జరిగాయని… 80 సంవత్సరాలు నిండిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కూడా కల్పించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వోటరు దినోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారన్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, ఆయా పోటీల్లో విజేతలైన విద్యార్థులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అధికారులు అందచేశారు. అలాగే కొంతమంది యువ ఓటర్లకు ఎపిక్ కార్డులను అందించారు.

Leave A Reply

Your email address will not be published.