Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ ప్రజాప్రతినిధుల నేర చరిత్ర.. అధికార పార్టీలోనే 59 మంది..

దక్ష న్యూస్, హైదరాబాద్ : అక్టోబర్ 22

118 మందికి 72 మందిపై కేసులు .. ఏడీఆర్ నివేదికలో వెల్లడి..

అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరితుల్ని గెలిపిస్తే ప్రజలకు ఏం సందేశమిస్తారు. తమ నేరపూరిత మనస్తత్వంతో పాలన ఏ విధంగా సాగిస్తారు .. ఇది ఇప్పుడు తెలంగాణ ( telangana ) రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. అందుకు కారణం ప్రజాప్రతినిధుల్లో అత్యధిక శాసనసభ్యులపై క్రిమినల్ కేసులు ఉండడమే. ప్రభుత్వాలను నడిపే, ప్రజలను పాలించే రాజకీయ నాయకులపైనే కేసులు ఉంటే సమాజానికి ఏం చేయగలుగుతారు. అత్యాచార, హత్యాయత్నం, మహిళలపై దాడులు, దొంగతనాల వంటి నేరాలకు పాల్పడి మళ్లా వచ్చి అధికారం చలాయిస్తామంటే ప్రజలు ఏ విధంగా స్పందించాలి. దేశంలో ప్రస్తుతం జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజా ప్రతినిధుల ఆస్తులు, క్రిమినల్ కేసుల వంటి వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( adr ) వెల్లడించింది. ఇందులో భాగంగానే తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేల క్రిమినల్‌ కేసుల చిట్టాను శనివారం బయటపెట్టింది.

read also : ఢిల్లీలో కాంగ్రెస్ నేతల సుదీర్ఘ చర్చ.. అయినా తేలని పొత్తు..

Hospital

ఏడిఆర్ నివేదిక ప్రకారం తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేలలో 72 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 46 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆసక్తికరమైన నివేదికను ఏడీఆర్‌ ప్రకటించింది. అధికార బీఆర్ఎస్ కు చెందిన 101 మంది ఎమ్మెల్యేలలో 58 శాతం మంది అంటే 59 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని నివేదికలో తెలిపింది. 119 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 118 మంది నేర, ఆర్థిక, ఇతర నేపథ్య వివరాలను విశ్లేషించి (ఏడీఆర్), తెలంగాణ ఎలక్షన్ వాచ్ ఈ నివేదికను విడుదల చేశాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే.

2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లు, ఆ తర్వాత నిర్వహించిన ఎన్నికల ఆధారంగా నివేదిక రూపొందించారు. ఏడుగురు ఎమ్మెల్యేలపై ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నానికి సంబంధించిన కేసులు, నలుగురు ఎమ్మెల్యేలపై మహిళలపై దాడులకు పాల్పడిన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్-376 కింద అత్యాచారానికి సంబంధించిన కేసు నమోదు అయింది. ఏఐఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురు (86 శాతం), కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు (67 శాతం), బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్లో ఒకరు తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారు.

read also : తనిఖీల్లో పట్టుబడే నగదు, బంగారం సీజ్ చేసేటప్పుడు మార్గదర్శకాలను పాటించాలి..

అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన 101 మంది ఎమ్మెల్యేలలో 38 (38 శాతం) మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నట్లు నివేదికలో తెలిపారు. అయితే ఏఐఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు (29 శాతం), కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు (50 శాతం), బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్లో ఒకరు తమ అఫిడవిట్‌లలో తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపధ్యంలో నేర చరితుల్ని చట్టసభలకు పంపితే ప్రజలకు మంచి చేస్తారనే నమ్మకంలేదని ఇప్పటికే తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 

 

Leave A Reply

Your email address will not be published.