Read News in Telugu Language
adsdaksha

శ్రావణ శుక్రవారం వచ్చేసింది..వరలక్ష్మీ పూజ ఇలా చేయండి..

దక్ష న్యూస్ ఆధ్యాత్మికం..

శ్రావణమాసం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది వరలక్ష్మీ వ్రతం ( varalakshmi vratham ). దాదాపు అందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. లేదా పక్కన ఎవరైనా చేస్తే వెళ్లి అమ్మవారివ్రతాన్ని తిలకించి, తీర్థప్రసాదాలు, సుమంగళీపదార్థాలను వాయనంగా తీసుకుంటారు. ఈ కింద పేర్కొన్న విధంగా భక్తి, శ్రద్ధలతో అమ్మవారిని అర్చించి వ్రతం చేసుకోండి. దాదాపు చిన్న విషయాలను కూడా ఇక్కడ పేర్కొన్నాం. అవకాశం మేరకు మీ ఇంటి పురోహితులతో పూజ చేయించుకొని దక్షిణ ఇచ్చుకోండి. అవకాశం కుదరని వారు తర్వాత అయినా పురోహితునికి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆశీస్సులు పొందండి.

శ్రావణ శుక్రవారం నాడు ఇలా చేయండి..

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.

కావలసినవి..
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.

తోరం ఎలా తయారు చేసుకోవాలి..

తెల్లటి దారాన్ని తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, తొమ్మిదో పువ్వులతో తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి. అమ్మవారికి ఇరువైపుల లేదా ఒక్కవైపున దీపారాధన చేయండి. దీపం ఉత్తరం లేదా ఆగ్నేయం లేదా మీకు అవకాశం ఉన్నవైపు పెట్టండి. దీపాన్ని వెలిగించిన తర్వాత కింది చెప్పినట్లు వ్రతం చేసుకోండి.

ఆచమనం, సంకల్పం అనంతరం గణపతి పూజ నిర్వహించాలి. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.
ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

Hospital

వరలక్ష్మీ వ్రత కథ :

(కథ ప్రారంభం ఈ సమయంలో చక్కగా కూర్చుని, అక్షింతలు చేతిలో తీసుకొని, కథను భక్తి శ్రద్దలతో వినాలి)

రమ్యమైన కైలాస పర్వతంలో ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు వినోదానికి పాచికలాడు తున్నారు. అందులో పార్వతి గెలిచినది. పరమ శివుడు పరాజితుడైనాడు. నేను గెలిచానంటే నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తలెత్తింది. సమీపమందున్న చిత్రనేమినడుగగా అతడు శివునిదే జయమని చెప్పాడు. కోపితురాలైన గౌరి అసత్యమాడిన చిత్రనేమిని కుష్ఠురోగివై భూలోకమున సరోవర తీరంలో పడిపొమ్మని శపించింది. క్షమింపుమని వేడి, చిత్రనేమి శాపావసానము నడిగెను. ప్రసన్నురాలైన పార్వతి, యే దినమున అప్సరకాంతలు ఆ సరోవరతీరంలో వరలక్ష్మీ వ్రతము చేయుదురో ఆ దినమున నీవా వ్రతమును చూచి శాపవిముక్తిని పొందెదవనెను. అదే విధముగ చిత్రనేమి శాపవిముక్తుడై కైలాసము చేరుకొనెను.

ఇంకొక వ్రతకథ ప్రకారం మగధదేశాన పూర్వము కుండిన అనే నగరం ఉండేది. అందులో చారుమతి అనునొక బ్రాహ్మణ స్త్రీ నివసించుచుండేది. ఆమె తన భర్తనే దైవముగ తలచి సేవించు చుండెను. త్రికరణ శుద్దిగల ఆ పతివ్రతామతాల్లిపై అనుగ్రహభావము గల్గి మహాలక్ష్మి ఒకనాటి రాత్రి స్వప్నమున సాక్షాత్కరించి “నేను వరలక్ష్మీదేవిని. శ్రావణశుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారమునాడు నీవు వరలక్ష్మీ వ్రతమును చేయుమని, ఆ వ్రతవిధానమును చెప్పి నీకు సర్వవిధ సౌభాగ్యములు కలుగుగాక” అని ఆశీర్వదించి అంతర్ధానమయింది. చారుమతి మేల్కొని సంతోషముతో తనకు కల్గిన స్వప్నమును పెద్దలందరికి చెపుతుంది. అందరు శ్రావణ శుక్రవారము కొఱకై ఎదురు చూశారు. శ్రావణ పూర్ణిమకు ముందున్న శుక్రవారము రాగా చారుమతి మున్నగు స్త్రీలందరు కలుసుకొని మిక్కిలి భక్తితో స్నానాదులు ముగించుకొని ఇంటిని గోమయముతో సుద్దిచేసి, మంటపము నేర్పరచి, రంగవల్లులతో అలంకరించి
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే |
నారాయణ ప్రియేదేవి సుప్రీతాభవసర్వదా ||
అను శ్లోకముచే ధ్యానావాహనాదిషోడశోపచార పూజలు చేసి నవసూత్ర తోరము కట్టుకొని భక్తితో వరలక్ష్మికి ప్రదక్షిణము చేశారు. మొదటి ప్రదక్షిణము చేయగానే ఘల్లుఘల్లుమను శబ్దము వచ్చెను. అందరి కాళ్లకు గజ్జెలు కట్టబడియుండెను. అంతయు వరలక్ష్మి కటాక్షమని తలంచి రెండవ ప్రదక్షిణము చేసిరి. స్త్రీలు అందరూ సర్వాభరణ భూషితలైరి. చారుమతి మొదలగు స్త్రీల గృహములన్నియు స్వర్ణమయములై రథగజతురగ వాహనములతో నిండిపోయెను. చారుమతి మొదలగు స్త్రీలందరు బ్రాహ్మణులకు వాయనములిచ్చిరి. ఆశీర్వాదము తీసుకొని ప్రతి సంవత్సరము అందరు అత్యంత శ్రద్ధాభక్తులతో వరలక్ష్మీ వ్రతము నాచరించుచు సర్వవిధ సౌభాగ్యములు బొంది సుఖించిరి. ఈ వ్రతమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. వరలక్ష్మీ వ్రతము సర్వ సంపత్కరమే కాక సర్వకార్యసిద్దిని కలుగజేయును.

(అక్షింతలు అమ్మవారిపై వేసి అందరి మీద వేసుకొని ప్రసాదం స్వీకరించాలి)

ముత్తైదవులకు వాయనం, పసుపు,కుంకుమలు ఇవ్వాలి. సాయంత్రం పేరంటం. అవకాశాన్ని బట్టి ముత్తైదువలకు తాంబూలం, పండ్లు తదితర సుమంగళి పదార్ధాలను సమర్పించాలి.

సేకరణ : AVB సుబ్బారావు , 9985255805

Leave A Reply

Your email address will not be published.