* అన్నాచెల్లెళ్ల అనుబంధానికి నిదర్శనం…
* శరీరం సహకరించకపోయినా.. చెల్లికి అండగా నిలిచిన అన్న!
* నడవలేని స్థితిలోనూ నామినేషన్ కేంద్రానికి వచ్చిన మాజీ వార్డు సభ్యుడు పంతుల వెంకట విశ్వేశ్వర ప్రసాద్..
I am with you : కుటుంబ బంధాలు, బాంధవ్యాలు.. ఆప్యాయతలు, అనురాగాలు, ఆత్మీయతలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ అన్నాచెల్లెళ్ల అనుబంధం అందరి దృష్టిని ఆకర్షించింది.బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, పొన్నపల్లి గ్రామంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ నడింపల్లిలోని పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో పొన్నపల్లి గ్రామ ఐదో వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న చర్ల నాగమణికి మద్దతుగా, ఆమెకు వరుసకు అన్న అయిన పంతుల వెంకట విశ్వేశ్వర ప్రసాద్ నామినేషన్ ప్రక్రియకు హాజరయ్యారు.

I am with you : గతంలో పొన్నపల్లి గ్రామ ఐదో వార్డు సభ్యుడిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, తన చెల్లెలిపై ఉన్న మమకారం, ఆమెకు అండగా నిలవాలనే సంకల్పంతో ఎంతో పట్టుదలగా నామినేషన్ కేంద్రానికి వచ్చారు. కారణాలు ఏవైనా, కష్టకాలంలో చెల్లికి తోడుగా నిలవాలనే ఆయన తపన పలువురిని కదిలించింది. శారీరక ఇబ్బందులు సంకల్పానికి అడ్డుకావని, ఆత్మీయ బంధాలకు పరిస్థితులు అడ్డు కావని తన చర్యతో చాటిచెప్పారు.
రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ఆప్యాయతను చాటిచెప్పిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కష్టసమయంలో చెల్లికి అండగా నిలిచిన పంతుల వెంకట విశ్వేశ్వర ప్రసాద్ అభినందనీయుడని పలువురు ప్రశంసిస్తున్నారు.




