Election : బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, పొన్నపల్లి గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ గా చౌటూరి దుర్గ, ఉప సర్పంచ్‌గా దొంతిబోయిన శివమ్మ లను ఎన్నుకున్నారు. గ్రామంలో రాజకీయ విభేదాలకు తావులేకుండా, గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా అందరూ కలిసి ఏకగ్రీవం చేయాలన్న గ్రామస్తుల విజ్ఞప్తిని గౌరవిస్తూ ఐదవ వార్డు అభ్యర్థులు చర్ల నాగమణి, సాయి లక్ష్మీ అశ్విని పొన్నపల్లి లో తమ అభ్యర్థిత్వాలను స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారు. గ్రామ ప్రజల ఆకాంక్షలకు గౌరవం ఇస్తూ వారు తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ హుందాతనానికి, సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది.

Election : గ్రామ అభివృద్ధి విషయంలో అనుభవం కలిగిన చర్ల నాగమణి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని అంగీకరిస్తూ దొంతిబోయిన షరాబంది రెడ్డి, దొంతిబోయిన సుభాని రెడ్డి, దొంతిబోయిన జగజీవన్ రెడ్డి, కుంచల బాలకోటి రెడ్డి, దొంతిబోయిన బాలకోటి రెడ్డి సౌభ్రాతృత్వ వాతావరణంలో తమ సమ్మతిని తెలియజేశారు. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రపోజర్‌గా వ్యవహరించిన పంతుల వెంకటరమణ విశ్వేశ్వర ప్రసాద్ సమక్షంలో అభ్యర్థిత్వాల ఉపసంహరణ ప్రక్రియ ఎలాంటి రాజకీయ ఉద్రిక్తతలకు తావులేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పూర్తయింది. గ్రామ ఏకగ్రీవానికి సహకరించి, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే గ్రామ అభివృద్ధికే ప్రాధాన్యతనిచ్చిన చర్ల నాగమణి హుందాతనాన్ని పలువురు అభినందించారు.
Election :ఈ సందర్భంగా చర్ల నాగమణి నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, సర్పంచ్ దుర్గ చౌటూరి, ఉప సర్పంచ్ దొంతిబోయిన శివమ్మతో పాటు నూతన పాలకవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలి… గ్రామ అభివృద్ధి విషయంలో అందరం ఒక్కటిగా ఉండాలి" అనే స్ఫూర్తితో నూతన పాలకవర్గం గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికీ సమాన ప్రాధాన్యతనిస్తూ పొన్నపల్లి గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. గ్రామ ప్రజల ఐక్యత, పరస్పర గౌరవం, సహకారంతో పొన్నపల్లి గ్రామం అభివృద్ధిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చర్ల నాగమణి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.






