* పొన్నపల్లి అగ్రహారం 5వ వార్డు సభ్యురాలిగా బరిలోకి చర్ల నాగమణి..
* ఉపాధ్యాయురాలిగా సుదీర్ఘ అనుభవం…
* సామాజిక కార్యకర్తగా నిరంతర పోరాటం…
* సొంత గ్రామ అభివృద్ధే లక్ష్యంగా మరో అడుగు..!
Ponnapalli : ఒక వ్యక్తి జీవితంలో విద్య, ఉద్యోగం, కుటుంబం ఎంత ముఖ్యమో, సమాజం పట్ల బాధ్యత కూడా అంతే ముఖ్యమని నమ్ముతూ తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి అగ్రహారానికి చెందిన చర్ల నాగమణి అలియాస్ పొన్నపల్లి నాగమణి. ఉపాధ్యాయురాలిగా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆమె, పదవీ విరమణ అనంతరం కూడా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సామాజిక పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తన పుట్టింటి అనుబంధం ఉన్న పొన్నపల్లి అగ్రహారం అభివృద్ధి కోసం 5వ వార్డు సభ్యురాలిగా ఎన్నికల బరిలోకి దిగి ప్రజాసేవకు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళ్తే..

* పుట్టుక నుంచే అనుబంధం..
Ponnapalli : పొన్నపల్లి అగ్రహారానికి చెందిన చర్ల నాగమణి తండ్రి చర్ల భాస్కరమూర్తి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో స్టేషన్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. తల్లి చర్ల సరస్వతి పొన్నపల్లి వారి ఆడపడుచు. ఆ విధంగా నాగమణికి పొన్నపల్లి అగ్రహారంతో పుట్టుక నుంచే విడదీయలేని అనుబంధం ఏర్పడింది. తన మేనమామ కుమారుడైన కీర్తిశేషులు పొన్నపల్లి కృష్ణమూర్తిని వివాహం చేసుకోవడంతో ఈ అనుబంధం మరింత బలపడింది. పొన్నపల్లి ఆమెకు కేవలం ఒక గ్రామం కాదు; పుట్టింటి అనుబంధం, కుటుంబ బంధాలు, జ్ఞాపకాలు, ఆత్మీయత కలగలిసిన స్వగ్రామం.
* విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు..
Ponnapalli : నాగమణి ప్రాథమిక విద్యను ఇచ్చాపురం ఎలిమెంటరీ పాఠశాలలో, ఉన్నత పాఠశాల విద్యను ఇచ్చాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యను మహారాజా కాలేజ్ ఫర్ ఉమెన్‌లో పూర్తి చేసి, మహారాజా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే ఎన్సీసీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని బి-గ్రేడ్ సర్టిఫికెట్ సాధించారు. బచ్చేలి, మదనపల్లి, గుజరాత్, బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్సీసీ శిబిరాల్లో పాల్గొని అనుభవాన్ని సంపాదించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ధ్రువపత్రాలు కూడా ఆమె వద్ద ఉన్నాయి.

అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ అడ్వైజరీ కమిటీలో నాగమణి బాధ్యతలు నిర్వహించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లో వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని గుర్తింపు పొందారు. సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలపై కూడా ప్రత్యేక ఆసక్తి కనబరిచారు.
* గురువుల ప్రేరణతో ముందడుగు..
తన జీవిత ప్రయాణంలో ముఖ్యంగా గణిత ఉపాధ్యాయులైన మల్లాది కామేశ్వరరావుని ఆమె మార్గదర్శిగా భావిస్తారు. ఆయన బోధించిన క్రమశిక్షణ, పట్టుదల, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే తత్వం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని చెబుతారు.
Ponnapalli : “ప్రయత్నించు… పోరాడు… సాధించు” అనే జీవిత సూత్రాన్ని తన ఆచరణలో భాగం చేసుకున్న నాగమణి ఉపాధ్యాయురాలిగా విద్యా రంగంలో విశేష సేవలు అందించారు. విశాఖపట్నంలోని విశాలాక్షినగర్ భారతీయ విద్యా కేంద్రంలో ఉపాధ్యాయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ పనిచేసిన సమయంలో విద్యా వాతావరణం, క్రమశిక్షణ, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అనుభవాలను సంపాదించారు. భారతీయ విద్యా కేంద్రంతో తనకున్న అనుబంధాన్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తుచేసుకుంటారు.

ఆ తర్వాత గూడవల్లి వనజా చంద్ర పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగినిగా శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని గార్రాజు చీపురుపల్లి గ్రామంలో సుమారు మూడున్నర సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని విశేష కృషి చేశారు. గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, గ్రామ పటాన్ని వేదికపై ప్రదర్శించే విధంగా ప్రత్యేకంగా కృషి చేయడం అప్పటి మంత్రి కిమిడి కళా వెంకట్రావు దృష్టిని ఆకర్షించింది. ఆమె చేసిన కృషికి ప్రశంసలు లభించడమే కాకుండా, ఆ పాఠశాలకు పక్కా భవన నిర్మాణం కోసం అప్పటికప్పుడు రూ.50,000 విలువైన చెక్కును మంత్రి అక్కడికక్కడే అందజేయడం విశేషం. ఒక ఉపాధ్యాయురాలిగా ఆమె చేసిన కృషి పాఠశాల అభివృద్ధికి ప్రత్యక్షంగా తోడ్పడిన సందర్భమిది.
అనంతరం అంతర్జిల్లా బదిలీల్లో చెరుకుపల్లి మండలానికి వచ్చి పలు పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించారు. విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు సృజనాత్మక విద్య, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇచ్చారు. విధుల నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ స్థాయిలో గుర్తింపు పొందారు.

* గ్రామాభివృద్ధిలో గతంలోనే తనదైన ముద్ర..
Ponnapalli : పొన్నపల్లి గ్రామానికి సేవ చేయాలనే ఆలోచన ఆమెకు ఇప్పుడే కలిగింది కాదు. గతంలో పొన్నపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పనిచేసిన సమయంలో కూడా గ్రామీణ ప్రజల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. అప్పటి సర్పంచ్ చౌటూరి రంగనాయకులు ఆధ్వర్యంలో యానాది కుటుంబాలకు పక్కా గృహాల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాల్లో కృషి చేశారు. 2007లో రక్షిత మంచినీటి పథకం కింద గ్రామానికి నీటి ట్యాంకు నిర్మించేందుకు స్థలం కేటాయించడానికి అనుమతి ఇవ్వడంలో కూడా సహకరించారు. ఈ కార్యక్రమాలన్నీ ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆశించకుండా, గ్రామీణ ప్రజల పట్ల ఉన్న అభిమానంతోనే చేసినవని ఆమె పలుమార్లు గుర్తుచేసుకుంటారు.
- ఊరు మనకెంతో ఇచ్చింది… ఊరికి మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాలి..అనే భావనను తన జీవితంలో ఆచరణలో పెట్టాలని ఆమె భావించారు అందుకే గ్రామం తనకు ఇచ్చిన ఆత్మీయతకు, అనుబంధానికి సేవ రూపంలో తిరిగి ఇవ్వాలని ఆమె సంకల్పించుకున్నారు.
* కుటుంబం..
నాగమణి తన కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. ఆమె కుమారుడు పొన్నపల్లి విద్యా భాస్కర్ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగిగా స్థిరపడగా, కుమార్తె ప్రసన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, సామాజిక బాధ్యతలు — ఈ మూడింటినీ సమన్వయం చేసుకుంటూ తన జీవిత ప్రయాణాన్ని నాగమణి విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

* పదవీ విరమణ తర్వాత కూడా ప్రజా సమస్యలపై పోరాటం..
చాలామంది ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత జీవితాన్ని గడపాలని భావిస్తారు. కానీ నాగమణి విషయంలో మాత్రం ఉద్యోగ విరమణ అనేది సామాజిక బాధ్యతల నుంచి విరామం కాలేదు. ప్రస్తుతం గుంటూరు జిల్లా భాజాప సమర్ధక్ మంచ్ సీనియర్ సిటిజన్స్ సంఘానికి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూ వృద్ధుల సమస్యలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ శాఖల బాధ్యతాయుతమైన పనితీరుపై నిరంతరం స్పందిస్తున్నారు.
గత రెండు సంవత్సరాలుగా రెవెన్యూ, పంచాయతీరాజ్, దేవాదాయ, ఏసీబీ, విజిలెన్స్, విద్యుత్, నీటిపారుదల, మైనింగ్, రియల్ టైమ్ గవర్నెన్స్, రిజిస్ట్రేషన్ తదితర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలపై ఫిర్యాదులు చేస్తూ వాటి పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
సుమారు 11 ప్రభుత్వ శాఖల పరిధిలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, సంబంధిత రికార్డులు కోరడం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అనుసరించడం ఆమె సామాజిక చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రశ్నించే హక్కు ఉందని, ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆమె విశ్వసిస్తారు. “ఉద్యోగం నుంచి మాత్రమే పదవీ విరమణ చేశాను. సామాజిక బాధ్యత నుంచి కాదు” అనేది ఆమె తరచూ చెప్పే మాట.
* అవయవదానం ద్వారా సమాజానికి ఆదర్శం..
సామాజిక సేవ కేవలం మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ ఉండాలని నమ్మే నాగమణి అవయవదానానికి కూడా ముందుకొచ్చారు. తన అవయవాలను దానం చేయడానికి అంగీకరించడం ద్వారా మరణానంతరం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాలనే గొప్ప ఆలోచనను చాటుకున్నారు. సమాజం పట్ల బాధ్యత అనేది ఒక వ్యక్తి జీవించి ఉన్నంతవరకే పరిమితం కాకూడదనే సందేశాన్ని తన నిర్ణయం ద్వారా అందించారు.
* ఇప్పుడు పొన్నపల్లి అగ్రహారం అభివృద్ధే లక్ష్యం..
తన జీవితంలో ఎన్నో ప్రాంతాల్లో విద్యా, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమైన నాగమణి, ఇప్పుడు తన పుట్టింటి అనుబంధం ఉన్న పొన్నపల్లి అగ్రహారానికి మరింత సేవ చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చారు. దాంతో ఈసారి పొన్నపల్లి అగ్రహారం గ్రామపంచాయతీలో 5వ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు.
తనకు ఈ గ్రామంతో ఉన్న బంధం కేవలం వివాహ సంబంధంతో ఏర్పడినది కాదని, పుట్టుకతోనే ఈ గ్రామంతో అనుబంధం ఉందని ఆమె చెబుతున్నారు. గ్రామంలోని ప్రజలతో కలిసి పనిచేస్తూ వార్డు సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలనేది ఆమె ఆకాంక్ష.
గ్రామంలో మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి సమస్యలు, ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు వంటి అంశాలపై ప్రజలతో కలిసి పనిచేయాలనే అభిలాషను వ్యక్తం చేస్తున్నారు.
తనకు రాజకీయాలు పదవుల కోసం కాదని, ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉన్న మరో వేదిక మాత్రమేనని ఆమె భావిస్తున్నారు.

* గెలుపోటములకు అతీతంగా ప్రజాసేవే జీవిత లక్ష్యం..
“జీవితంలో గెలుపోటములను నిర్ణయించేది భగవంతుడే. కానీ ఒక వ్యక్తి అయినా, ఒక వ్యవస్థ అయినా శాశ్వతంగా నిలబడదు. మనం చేసిన మంచి పనులే మనల్ని ప్రజల జ్ఞాపకాల్లో నిలబెడతాయి” అనే భావనను నాగమణి తరచూ వ్యక్తం చేస్తుంటారు. విద్యార్థి దశలో ఎన్సీసీ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం, ఉపాధ్యాయురాలిగా సేవలు, జన్మభూమి కార్యక్రమాల్లో భాగస్వామ్యం, పాఠశాల భవన నిర్మాణానికి నిధుల సమీకరణలో చేసిన కృషి, గ్రామీణ అభివృద్ధికి సహకారం, సీనియర్ సిటిజన్స్ నాయకత్వం, ప్రభుత్వ శాఖలతో ప్రజా సమస్యలపై పోరాటం, అవయవదానం వరకు సాగిన ఆమె జీవిత ప్రయాణం అనేక కోణాలను కలిగి ఉంది. ఇప్పుడు అదే సేవా స్ఫూర్తితో తన స్వగ్రామమైన పొన్నపల్లి అగ్రహారం 5వ వార్డు అభివృద్ధికి మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారు. నాకు పదవి కంటే ప్రజలతో ఉండే అనుబంధం ముఖ్యం. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసుకుంటూ పనిచేయాలనుకుంటున్నాను” అని ఆమె తన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయురాలిగా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆమె, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా తన గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తున్నారు. అందుకే పొన్నపల్లి అగ్రహారం 5వ వార్డు ప్రజలు కూడా చర్ల నాగమణి కి పట్టం కట్టేందుకు సుముఖతను వ్యక్తం చేస్తూ ఎన్నికల గడియ కోసం ఎదురుచూస్తున్నారు.





